PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.

Ap Pg Doctors New Rules

Ap Pg Doctors New Rules

PG Doctors New Rules: పీజీ వైద్య విద్యార్థుల విధులు, సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి వరుసగా డ్యూటీ చేయించకూడదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. నైట్ డ్యూటీ చేసిన పీజీ వైద్యులకు మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రతి వారం ఒక రోజు పూర్తి సెలవు కల్పించాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మెడికల్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ హెచ్చరించారు.

పీజీ వైద్య విద్యార్థులపై పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. విద్యార్థుల కోసం కౌన్సెలింగ్, టైమ్ మేనేజ్‌మెంట్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా పీజీ వైద్య విద్యార్థులకు సెలవుల విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి 20 రోజుల పెయిడ్ క్యాజువల్ లీవులు, 5 రోజుల అకడమిక్ లీవులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వీటితో పాటు సంవత్సరంలో 52 వారాంతపు సెలవులు కూడా కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

పీజీ వైద్యుల పని గంటలు, విశ్రాంతి, సెలవుల విషయంలో ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని డీఎంఈ స్పష్టం చేశారు. వైద్య విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.