AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 1.18 లక్షల నామినేషన్లు.. పూర్తి లెక్కలివే..!

Ap Panchayat Elections

Ap Panchayat Elections

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీకి సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాలు, 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం కలిపి మొత్తం 1,18,114 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ పదవులకు 25,985 నామినేషన్లు రాగా, వార్డు సభ్యుల స్థానాలకు 92,129 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా నామినేషన్ల సంఖ్యలో ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

తిరుపతి జిల్లాలో అత్యధిక నామినేషన్లు
రాష్ట్రంలో అత్యధికంగా 404 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన జిల్లా తిరుపతి. ఇక్కడ సర్పంచ్ పదవులకు 3,261 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 7,088 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ నామినేషన్లలో తిరుపతి జిల్లా రాష్ట్రంలో ముందంజలో నిలిచింది. ఇక అనంతపురం జిల్లాలో సర్పంచ్ పదవులకు 1,822 నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 1,550, అనకాపల్లి జిల్లాలో 1,347 సర్పంచ్ నామినేషన్లు వచ్చాయి.

వార్డు సభ్యుల నామినేషన్లలో ఈ జిల్లాలు టాప్
వార్డు సభ్యుల నామినేషన్ల విషయంలో అనకాపల్లి జిల్లా 6,549 నామినేషన్లతో ముందుంది. ఏలూరు జిల్లాలో 5,154, విజయనగరం జిల్లాలో 5,134 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు అన్నమయ్య జిల్లాలో అత్యల్పంగా 85 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఈ జిల్లాలో సర్పంచ్ పదవులకు 329, వార్డు సభ్యుల స్థానాలకు 1,112 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి.

విశాఖ, గుంటూరు జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు లేవు
అయితే, మొదటి విడత పోలింగ్‌లో విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన జిల్లాల్లో నోటిఫికేషన్ వెలువడిన గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.