AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మన్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు.. పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్.. ఫలితాల ప్రకటన కూడా జరిగిపోయింది.. ఇక, పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. విశాఖపట్నం మినహా మిగిలిన 27 జిల్లాల్లోని 52 డివిజన్లు, 246 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 4,975 గ్రామ పంచాయతీల్లో 1,095 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,880 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
4,975 సర్పంచ్ స్థానాలు.. 49,318 వార్డు సభ్యుల స్థానాలు
రెండో విడతలో మొత్తం 4,975 సర్పంచ్ స్థానాలు, 49,318 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. వీటిలో 1,170 సర్పంచ్ స్థానాలు, 19,655 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,803 సర్పంచ్ స్థానాలకు, 29,603 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. మరోవైపు రెండు పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు, 60 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.
బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు
రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం 10,295 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వార్డు సభ్యుల స్థానాలకు 63,395 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణలు, ఏకగ్రీవాల ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఏర్పాట్లలో భాగంగా 37,019 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 83,52,338 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 41,05,292 మంది పురుషులు, 42,46,608 మంది మహిళలు ఉన్నారు. మరో 438 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 5,65,848 మంది ఓటర్లు ఉండగా, 342 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
9,300 కెమెరాలతో పోలింగ్ పర్యవేక్షణ
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు భారీ స్థాయిలో నిఘా ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యాలయం నుంచి 9,300 కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. వీటితో పాటు 8,470 వీడియోగ్రఫీ ఏర్పాట్లు, 5,186 వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు, 3,469 ఇతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. మరోవైపు.. రెండో విడత ఎన్నికల్లో రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పోలవరం జిల్లా ఏటపాక మండలంలోని వెంకటరెడ్డిపాలెం పంచాయతీలో సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపూర్ మండలం కె. సుకుమంచిపల్లి గ్రామ పంచాయతీలోనూ సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. ఈ పంచాయతీలో గతంలోనూ ఎన్నికలను బహిష్కరిస్తూ వస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 83 లక్షలకు పైగా ఓటర్లు, వేలాది మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది. భారీ భద్రత, సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ మధ్య రేపు పోలింగ్ జరగనుంది.

