AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గురువారం రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరిగింది.. అయితే, తుఫాన్ ప్రభావం, ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనల కారణంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి.. గతంలో వాయిదా పడిన పలు మండలాలు, గ్రామాల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. తుఫాన్ కారణంగా వాయిదా పడిన స్థానాలతో పాటు, ఎన్నికల సమయంలో జరిగిన ఘటనల కారణంగా పోలింగ్ నిలిచిపోయిన ప్రాంతాల్లోనూ ఓటింగ్ జరుగుతుంది..
తుఫాన్ కారణంగా వాయిదా పడిన ఎన్నికలు
తుఫాన్ కారణంగా వాయిదా పడిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో ఒక జడ్పీటీసీ, 18 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.. ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో ఒక జడ్పీటీసీ, 15 ఎంపీటీసీ స్థానాలకు, జీలుగుమిల్లి మండలంలో ఒక జడ్పీటీసీ, 9 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. అలాగే ఏలూరు జిల్లాలోని పోలవరం మండలంలో ఒక జడ్పీటీసీ, 11 ఎంపీటీసీ స్థానాలకు, వేలేరుపాడు మండలంలో ఒక జడ్పీటీసీ, 7 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ స్టార్ట్ అయ్యింది.. ఈ ప్రాంతాల్లో తుఫాన్ పరిస్థితుల కారణంగా గతంలో ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఎన్నికల ఘటనలతో వాయిదా పడిన స్థానాల్లోనూ పోలింగ్
మరోవైపు ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనల కారణంగా వాయిదా పడిన కొన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. అనంతపురం జిల్లా కూడేరు మండలం మారుట్ల గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 8లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇదే జిల్లాలోని పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామంలోని పోలింగ్ స్టేషన్లు 46, 47లోనూ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
కర్నూలు జిల్లా కోసిగి మండలం అర్లబండ గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 2లో జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుండగా.. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం పొన్నం గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 2లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. అదేవిధంగా మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 5లో జడ్పీటీసీ ఎన్నిక, పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామంలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 43లో జడ్పీటీసీ ఎన్నిక జరుగుతుంది.. గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.. ఇక, రేపు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు..

