AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే

Ap Govt

Ap Govt

AP Mayor Reservations: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేయర్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మేయర్ స్థానాల్లో బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయించారు. జనరల్ మహిళలకు 5 స్థానాలు, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి 4 స్థానాలు కేటాయించారు.

ఏ కార్పొరేషన్‌లో.. ఏ రిజర్వేషన్‌..?
రిజర్వేషన్ల వివరాల ప్రకారం మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎస్టీ కేటగిరీకి కేటాయించారు. కర్నూలు మేయర్ స్థానం ఎస్సీ మహిళకు, రాజమండ్రి మేయర్ స్థానం ఎస్సీ జనరల్ కేటగిరీకి కేటాయించారు. దీంతో ఎస్సీలకు కేటాయించిన రెండు స్థానాల్లో ఒకటి మహిళకు, మరొకటి జనరల్ కేటగిరీకి దక్కింది. బీసీలకు మొత్తం ఐదు మేయర్ స్థానాలు కేటాయించారు. వీటిలో ఏలూరు, అనంతపురం, చిత్తూరు మేయర్ స్థానాలను బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించగా, కాకినాడ, మచిలీపట్నం స్థానాలను బీసీ మహిళలకు కేటాయించారు. జనరల్ మహిళల కేటగిరీలో విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప మేయర్ స్థానాలు ఉన్నాయి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మేయర్ స్థానాలను కేటాయించారు.

ప్రభుత్వం రిజర్వేషన్లపై నోటిఫికేషన్ విడుదల చేయడంతో మేయర్ స్థానాల వారీగా కేటాయింపులపై స్పష్టత వచ్చింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపిక, రాజకీయ పార్టీల వ్యూహాలు కీలకంగా మారనున్నాయి. కాగా, స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై కూటమి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేయగా.. హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగలడం.. ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా.. అక్కడ కూడా సానుకూలమైన వాతావరణం లేకపోవడంతో.. చివరకు పార్టీ పరంగా అంటే.. కూటమి పార్టీలు.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం విదితమే..