AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR) పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ఏపీ హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆరు వారాల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేసింది.
అయితే, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి ఏ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటే, దాని ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. SIR ప్రక్రియ పూర్తికాకపోతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ప్రక్రియ పూర్తయి కొత్త జాబితా సిద్ధమైతే దాని ఆధారంగా ఎన్నికలు జరపాలని పేర్కొంది.. ఇదిలా ఉండగా, అక్టోబర్ 16న SIR తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి అందుబాటులో ఉండే జాబితాను అనుసరించి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు సూచించడంతో, ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయినట్టు అయ్యింది..

