AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు ఏపీ హైకోర్టు బుధవారం కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డితో పాటు ముప్పిడి అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ష్యూరిటీలు సమర్పించిన అనంతరం బెయిల్‌పై ఉత్తర్వులు వెలువడ్డాయి.
హైకోర్టు విధించిన కీలక షరతులు
లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిందితులకు పలు కఠినమైన షరతులు విధించింది.
* ప్రతి శనివారం విచారణ అధికారికి హాజరు కావాలి
* తాము ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ వివరాలు అధికారులకు తెలియజేయాలి
* దేశం విడిచి వెళ్లరాదు
* తమ పాస్‌పోర్ట్‌ను అధికారులకు అప్పగించాలి
* కేసులోని సాక్షులను ప్రభావితం చేయకూడదు
* సహ నిందితులతో ఎలాంటి సంప్రదింపులు చేయరాదు
* రూ.2 లక్షల విలువైన రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని స్పష్టం చేసింది..
అయితే, లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో, హైకోర్టు తాజా ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బెయిల్ లభించిన నిందితులు షరతులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, బెయిల్ తిరస్కరణకు గురైన నిందితులు తదుపరి న్యాయపరమైన మార్గాలు అన్వేషించే అవకాశం ఉందని న్యాయవర్గాలు చెబుతున్నాయి.
