Site icon NTV Telugu

Social Media Ban for Children Below 16: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..! సీఎం కీలక ఆదేశాలు

Cbn

Cbn

Social Media Ban for Children Below 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని పోలీస్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు, యువతపై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా విచ్చలవిడితనానికి బ్రేకులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Read Also: Tamarind Pulihora Recipe: అచ్చం గుడిలో పెట్టె ప్రసాదంలా ఉండే చింతపండు పులిహోర.. చేసేయండి ఇలా!

ఇక, సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ అంశంపై ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని సీఎం సూచించారు. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై అధ్యయనం చేయాలి.. వరుసగా అవగాహనా సదస్సులు నిర్వహించాలి.. తల్లిదండ్రులు, విద్యార్థులకు సోషల్ మీడియా ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశించారు. చట్టపరమైన అంశాలు, సాంకేతిక పరిష్కారాలు, అవగాహనా కార్యక్రమాలు అన్నింటినీ కలిపిన సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. పిల్లల భద్రత, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Exit mobile version