AP New Districts: రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రంపచోడవరం హెడ్ క్వార్టర్‌గా పోలవరం జిల్లా ఏర్పాటైంది. మార్కాపురం హెడ్ క్వార్టర్‌గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ్టి నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయి. పోలవరం, మార్కాపురంతో ఏపీలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. మొదట మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, అభ్యంతరాలు రావడంతో.. అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్‌ను రాయచోటి నుంచి మదనపల్లికి మార్చింది. ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లనూ ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులనూ మార్చింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
Read Also: Podili Police – Trader Clash: వ్యాపారితో పోలీసుల ఘర్షణ.. సీఎం సీరియస్, చర్యలకు ఆదేశాలు
జిల్లాల సరిహద్దులకు సంబంధించిన తుది ప్రకటననూ ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు 77 రెవెన్యూ డివిజన్లుండగా.. కొత్తగా ఏర్పాటు చేసిన ఐదింటితో కలిపితే వాటి సంఖ్య 82 చేరింది. అలాగే.. మండలాల సంఖ్య కూడా 679 నుంచి 681కి పెరిగింది. పెనుగొండ మండలాన్ని వాసవీ పెనుగొండగా మార్చారు. నందిగామను పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. సామర్లకోటను కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురానికి మార్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొన్ని మండలాలను మార్చారు. గూడురు నియోజవర్గంలోనిలోని 3 మండలాలను నెల్లూరుకు తీసుకువచ్చారు. 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ క్యాబినెట్లో ఆమోదం తెలపగా వాటన్నింటికీ సంబంధించి తుది ప్రకటన జారీ అయింది.
