Site icon NTV Telugu

AP Government: గుడ్‌ న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. వారికి ఉచిత విద్యుత్.. పెన్షన్‌ పెంపు..

Ap Govt

Ap Govt

AP Government: చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు చేనేత మరియు టెక్స్‌టైల్స్‌ శాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో చేనేతలకు అండగా ఉంటామని మాట ఇచ్చాం. గతంలో టీడీపీ ఎన్టీఆర్ కాలం నుంచి చేనేతలకు తోడుగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం హ్యాండ్‌లూమ్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని తెలిపారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,03,534 చేనేత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. హ్యాండ్‌లూమ్ (మగ్గం): 200 యూనిట్లు – 93,000 కుటుంబాలు ఉండగా.. పవర్‌లూమ్ (మర మగ్గం)కు 500 యూనిట్లు – 10,534 కుటుంబాలకు అందించనున్నారు.. ఈ పథకం ద్వారా సుమారు 4 లక్షల మందికి ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. నెలకు సుమారు రూ.85 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుందని మంత్రి తెలిపారు. ఈ స్కీమ్‌ ద్వారా మగ్గం లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.720, ఏడాదికి రూ.8,640 ఆదా కానుంది.. మర మగ్గం లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.1,800, ఏడాదికి రూ.21,600 ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు..

నేతన్నలకు పెన్షన్ పెంపు
మరోవైపు, 50 ఏళ్ల వయస్సు నుంచే నేతన్నలకు రూ.4,000 పెన్షన్ అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం 87,280 మంది నేతన్నలకు పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000కి పెంచడంతో ఒక్కో నేతన్నకు ఏడాదికి రూ.12,000 అదనపు లబ్ధి లభిస్తోందని వివరించారు. ఇక, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టినట్లు మంత్రి సవిత తెలిపారు. ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు రూ.7 కోట్ల బకాయిలు చెల్లించామని తెలిపారు.. ఈ ఏడాది తొలి విడతగా రూ.1.67 కోట్ల త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేశాం.. NHDC ద్వారా నూలుపై 15 శాతం రాయితీ కూడా ఇస్తున్నాం.. మరోవైపు, నేతన్నలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఛార్జీలను కూడా పెంచనుంది ప్రభుత్వం.. ఆప్కోలో రెడీమేడ్ దుస్తుల అమ్మకాలతో ఉపాధి పెంచనుంది.. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కో-ఆప్టెక్స్, టాటా తనేరియా, బిర్లా ఆద్యం సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.

ఇక, ఈ-కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల డోర్ డెలివరీ.. విశాఖలో 5 ఎకరాల్లో రూ.172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణం.. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్‌టైల్ పార్కులు.. మంగళగిరిలో మెగా టెక్స్‌టైల్ పార్క్.. ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్, పిఠాపురంలో మరో మెగా క్లస్టర్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ.10.44 కోట్లతో 10 చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు.. మరోవైపు, ODOP అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 9 అవార్డుల్లో 4 చేనేత ఉత్పత్తులకే దక్కాయి. చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు గాను రాష్ట్రానికి జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించిందని మంత్రి సవిత వెల్లడించారు.

Exit mobile version