CM Chandrababu: రాష్ట్రంలో వర్షాలు గణనీయంగా తగ్గాయని, దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా, కేవలం 557 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉందన్నారు.
కొన్ని జిల్లాల్లో జూలైలో ఏకంగా 68 శాతం వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు చంద్రబాబు… ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 35 శాతం చొప్పున, అక్టోబర్‌లో 25 శాతం, నవంబర్‌లో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. డిసెంబర్‌లో మాత్రం ఒక శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది సగటున 35.5 శాతం వర్షపాతం లోటు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారని చంద్రబాబు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఈ లోటు 42 శాతం వరకు ఉండే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
నీటి వినియోగంలో తొందరపాటు వద్దు
వర్షాభావ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు నీటిని అందించాలనే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చంద్రబాబు హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. నీటి నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నీటిని పొదుపుగా వినియోగిస్తూ పలు ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకున్నామని తెలిపారు. వివిధ నదీ బేసిన్లలో నీటి లభ్యత తగ్గిపోతోందని, ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోతున్నాయని సీఎం వివరించారు.
శ్రీశైలానికి భారీగా తగ్గిన నీటి రాక
శ్రీశైలం ప్రాజెక్టుకు సాధారణంగా 753 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 214 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీరు వస్తుందని, ఆయా రాష్ట్రాల్లోని రిజర్వాయర్లు నిండిన తర్వాతే దిగువకు నీటి ప్రవాహం వస్తుందని చెప్పారు. దీని ప్రభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా నీటి రాక తగ్గిందన్నారు. గోదావరి బేసిన్‌లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..
రైతులు తొందరపడి వరి సాగు చేయొద్దు
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు తొందరపడి వరి పంట వేయడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చంద్రబాబు సూచించారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని రైతులకు సూచించారు. ఉద్యానవన పంటల విషయంలోనూ అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగిస్తూ ప్రజల అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
పోలవరం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
పోలవరం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టు కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి నీటిని తరలిస్తామని చెప్పారు. గోదావరి జలాలు అనకాపల్లికి చేరుతాయని, వచ్చే ఏడాది విశాఖపట్నానికి కూడా గోదావరి నీరు చేరేలా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను అందించడం ద్వారా తాగునీరు, పరిశ్రమలు, ఇతర అవసరాలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
నీటి సమస్యలపై ముందస్తు ప్రణాళిక అవసరం
గ్రామాల మధ్యే కాకుండా రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా నీటి సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు అన్నారు. కావేరి జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక మధ్య కొనసాగుతున్న వివాదంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో నీటి కొరత మరింత తీవ్రం కాకుండా ఇప్పటి నుంచే సమగ్ర నీటి నిర్వహణ అవసరమని చెప్పారు. ఎల్‌నినో ప్రభావాన్ని ప్రజలు అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముందస్తు ప్రణాళిక, నీటి నిల్వలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అసెంబ్లీలో స్పష్టం చేశారు.

