Site icon NTV Telugu

AP Mega DSC: మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు కీలక సూచనలు

Ap Dsc

Ap Dsc

AP Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీకి సంబంధించిన కీలక సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు మెగా డీఎస్సీ 2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి.. పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు చేపడతామని స్పష్టం చేసిన ఆయన.. అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పం అన్నారు.. మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. తర్వాత టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చాం.. అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశం కూడా ఇచ్చాం.. స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మెరిట్ లిస్ట్ జాబితా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు జిల్లా విద్యాధికారి వెబ్‌సైట్‌లో కూడా ఉంచడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే సమాచారం పొందాలని తెలిపారు..

Read Also: Railway Luggage Rule: రైల్వే ప్రయాణికుల అదనపు లగేజీపై ఛార్జీలు.. క్లారిటీ ఇచ్చిన రైల్వే మంత్రి

ఇక, వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ‘జోన్ ఆఫ్ కన్సిడరేషన్’ లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించబడుతుందని తెలిపారు ఎంవీ కృష్ణారెడ్డి.. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని వివరించారు.. వెరిఫికేషనుకు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు.. వెరిఫికేషన్ సమయంలో సమర్పించవలసిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైనా మెరిట్ లిస్టులో తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తాం.. ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తూ, అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, ఇలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

Read Also: TVK rally tragedy: టీవీకే సభలో ఘోరం.. స్పృహతప్పి పడిపోయిన 400 మంది కార్యకర్తలు.. పలువురు మృతి

కాబట్టి అభ్యర్థులు కేవలం డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్ట్, ఎంపిక జాబితాలు, నియామక ఉత్తర్వులు మెగా డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌, జిల్లా విద్యాధికారి వెబ్‌సైట్‌, క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ప్రకటించారు మెగా డీఎస్సీ 2025 కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి.

Exit mobile version