AP Cabinet Meeting Today: ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ముందు నేడు కీలక అజెండా ఉంది.. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ. 1208.41 కోట్లు వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫసాడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు రూ. 2540 కోట్లు వ్యయం చేయడానికి అనుమతి ఇవ్వనుంది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ. 798 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు కూడా మంత్రి మండలి మంజూరు ఇవ్వనుంది.
Read Also: Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
ఎల్పీఎస్ జోన్-11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆమోదం ఇవ్వనుంది. రాజధానిలో 220 కేవీ లైన్ల రీరూటింగ్‌కు కూడా అనుమతి ఇవ్వనుంది కేబినెట్.. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మెట్ట భూములకు ఎకరాకు రూ. 40,000, జరీబు భూములకు రూ. 60,000 చొప్పున కౌలు పెంపుకు అనుమతి ఇవ్వనుంది. అలాగే ప్రతి ఏడాది మెట్ట భూములకు రూ. 3,000, జరీబు భూములకు రూ. 5,000 చొప్పున పదేళ్ల పాటు పెంచేందుకు కూడా ఆమోదం తెలపనుంది.
రాజధానిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సీఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని కేబినెట్‌లో ఖరారు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం వేర్వేరు ప్రాంతాల్లో 4.23 ఎకరాల భూమిని కేటాయించనుంది. అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపుకు అనుమతి ఇవ్వనుంది. డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. ఆప్కాబ్‌కు రాయపూడి వద్ద 0.49 ఎకరాల భూమిని కేటాయించనుంది.
“బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేబినెట్ అభినందనలు తెలియజేయనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో డీజిల్ సమస్యపై కూడా చర్చించే అవకాశం ఉంది.
