AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు వివరించారు మంత్రి పార్థసారథి.. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026’తో పాటు ‘పీపీపీ పాలసీ-2026’ ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే దిశా బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024లను ఉపసంహరించి, వాటి స్థానంలో మరింత పటిష్ఠమైన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల (UDAలు) పునర్‌వ్యవస్థీకరణకు, పాదచారుల భద్రత పాలసీ-2026కు కూడా ఆమోదం తెలిపింది.
మరోవైపు.. అమరావతిలో ప్రపంచ స్థాయి పర్యాటక ఆకర్షణగా ‘అమరావతి ఐ’ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పరిసరాల్లో గ్రీనరీ పార్కుల అభివృద్ధికి అవసరమైన భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు మంత్రి పార్థసారథి.. అలాగే రానున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రూ.210 కోట్ల విడుదలకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. పుష్కరాల ఏర్పాట్లపై ఐదుగురు ఐఏఎస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు.
ఇక, కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమై పలు కీలక అంశాలపై వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన సీఎం, డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజల్లో ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం అన్ని వివరాలను ఇప్పటికే ప్రజలకు స్పష్టంగా వెల్లడించిందని సీఎం చెప్పారు. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు. ఈ అంశంపై కోర్టులు కూడా వైసీపీకి చీవాట్లు పెట్టినా, దుష్ప్రచారం కొనసాగుతుండటం సరికాదన్నారు. వైసీపీ అధినేత జగన్ పరామర్శలపై కూడా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పరామర్శలకు వెళ్లిన ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, రైతుల పంటలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. పలువురు రైతులు తమకు నేరుగా సందేశాలు పంపి నష్టాన్ని వివరించారని పేర్కొన్నారు. దీంతో జగన్ పరామర్శలు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు..

