BC Reservation Bill: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శాసనసభలో ప్రవేశపెట్టారు. బీసీల రాజకీయ సాధికారతకు ఈ నిర్ణయం కీలక అడుగు అని ఆమె పేర్కొన్నారు. బీసీల పక్షపాత ప్రభుత్వంగా తమ ప్రభుత్వం మరోసారి రుజువు చేసుకుందని అన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో 33 శాతం మేర రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు వివరించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనపై ఇప్పటికే మంత్రిమండలి ఆమోదం తెలిపిందని, ఇప్పుడు శాసనసభలో కూడా బిల్లును ఆమోదించనున్నట్లు మంత్రి చెప్పారు.
బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం
బీసీల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని సవిత అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. బీసీలకు తొలిసారిగా 1994లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తుచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆమె విమర్శించారు. రిజర్వేషన్లలో 10 శాతం కోత కారణంగా 16,800 పదవులకు బీసీలు దూరమయ్యారని తెలిపారు. ఇప్పుడు బీసీలకు మరోసారి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
బీసీల కోసం భారీగా బడ్జెట్ కేటాయింపులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. తొలి బడ్జెట్‌లో రూ.39 వేల కోట్లు, రెండో బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లు, మూడో బడ్జెట్‌లో రూ.51 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. బీసీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ కేటాయింపులే నిదర్శనమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వ తదుపరి చర్యల కోసం పంపించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
గీత కార్మికులు, వడ్డెరలకు ప్రత్యేక ప్రాధాన్యం
బీసీ వర్గాల్లోని వివిధ కులాలు, వృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సవిత తెలిపారు. గీత కార్మికులకు మద్యం షాపులు, బార్ల కేటాయింపుల్లో 10 శాతం మేర అవకాశం కల్పించడంతో పాటు మద్యం షాపుల లైసెన్స్‌లో 50 శాతం రాయితీ ఇచ్చామని చెప్పారు. గీత కార్మికులు కేవలం కార్మికులుగా మిగిలిపోకుండా వ్యాపారులుగా ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వడ్డెరలకు క్వారీల కేటాయింపుల్లో 33 శాతం రిజర్వేషన్లు, 50 శాతం సీనరేజీ మినహాయింపు కల్పించినట్లు తెలిపారు.
మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులకు ప్రయోజనాలు
చేపల వేట నిషేధకాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామని మంత్రి తెలిపారు. మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు జీవో 217ను రద్దు చేశామని చెప్పారు. నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పెంచామని వివరించారు.
ప్రభుత్వ పథకాల్లో బీసీలకు ఎక్కువ ప్రయోజనం
తల్లికి వందనం, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, ఉచిత ఇసుక, పెన్షన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందుతున్న వర్గాల్లో బీసీలు ముందున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం లభిస్తుందని ఆమె అన్నారు. బీసీలకు రాజకీయ పట్టం కట్టేందుకు చర్యలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బీసీలకు మరోసారి మంచి రోజులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు.

