Site icon NTV Telugu

DGP Harish Kumar Gupta: గత ఏడాదితో పోలిస్తే… ఈ ఏడాది క్రైమ్‌ రేట్‌ బాగా తగ్గింది-డీజీపీ

Dgp Harish Kumar Gupta

Dgp Harish Kumar Gupta

DGP Harish Kumar Gupta: రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే 2025లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, పోలీసింగ్‌లో సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్ ఘటనను పోలీస్ శాఖ విజయం లేదా మావోయిస్టుల ఓటమిగా చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రజలకు చెబుతున్నాం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకోవడమే మా బాధ్యత అని స్పష్టం చేశారు.

Read Also: CM Revanth Reddy: సభలో నుంచి కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారో ఆయన్నే అడగండి..

ముఖ్యంగా సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, మత్తు పదార్థాల రవాణా నియంత్రణ ఏపీ పోలీసులకు ప్రధాన సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు డీజీపీ.. సైబర్ మోసాల్లో డబ్బు రికవరీ చేయడం చాలా కష్టమైపోతున్నదని, ఒకసారి నగదు విదేశాలకు – ముఖ్యంగా చైనా గ్యాంగ్స్ ఖాతాల్లోకి వెళ్లిన తర్వాత తిరిగి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమవుతోందని వివరించారు. అందుకే ప్రజల్లో సైబర్ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో డ్రగ్స్, గంజాయి రవాణాను అరికట్టడంపై మరింత ఫోకస్ పెట్టాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా తగ్గించడంలో పురోగతి సాధించినప్పటికీ.. ఈ నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు చెందిన 343 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించామని, వారిపై నిఘా కొనసాగుతోందని వెల్లడించారు. బెంగళూరు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డ్రగ్స్ లింకులను బ్రేక్ చేసేందుకు దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్టు చెప్పారు.

మహిళల భద్రత విషయంలోనూ ఏపీ పోలీసులు మంచి పురోగతి సాధించారని డీజీపీ తెలిపారు. ఆలయాల వద్ద లక్షల్లో భక్తులు వచ్చే సందర్భాల్లో అక్కడక్కడా వేధింపుల ఘటనలు నమోదవుతాయి. కానీ, వాటిని జనరలైజ్ చేసి చూడకూడదు. మహిళల రక్షణకు మేం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన పేర్కొన్నారు. సెల్‌ఫోన్ల రికవరీ, నేరాల నియంత్రణ, మత్తు రవాణా నిరోధం వంటి అంశాల్లో 2025లో మెరుగైన ఫలితాలు వచ్చాయని తెలిపారు. వచ్చే పదేళ్లలో పోలీసింగ్ ఎలా ఉండాలి అన్న అంశంపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్టు డీజీపీ చెప్పారు. ఈ మేరకు సంక్రాంతి పండుగ తర్వాత అమరావతిలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందులో పోలీసింగ్‌లో వచ్చిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కీలక కేసుల ఛేదన విధానాలను అధికారులకు వివరించనున్నారు.

కేంద్ర నివేదికల్లో ఏపీ 36వ స్థానంలో ఉందన్న ప్రచారం పాత సిస్టమ్ ఆధారమైనదని, రాష్ట్రం లేఖ ద్వారా ఇప్పటికే ఆ తప్పును కేంద్రానికి తెలియజేసిందని, డేటా వ్యత్యాసాల కారణంగానే అపోహలు వచ్చాయని వివరించారు. ఇప్పుడు డ్యాష్‌బోర్డులో ఏపీ వాస్తవ స్థానం కనిపిస్తుంది అని తెలిపారు డీజీపీ.. అదేవిధంగా పేకాట క్లబ్బులు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీస్ శాఖ మరింత కఠినంగా వ్యవహరిస్తుందని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసే స్థాయికి వెళ్తామని హెచ్చరించారు. నేరాలు తగ్గడం మా విధుల్లో పురోగతి మాత్రమే. ఇందులో విజయం – అపజయం ఉండదు. చట్టాన్ని అమలు చేయడమే మా పని” అని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు.

Exit mobile version