Site icon NTV Telugu

Deputy CM Pawan Kalyan: గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలు

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడంతో పాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతం వరకు పెంచాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, గ్రీన్‌ కవర్‌ మరియు గ్రేట్‌ గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్టుల అమలులో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనబడాలని అధికారులకు సూచించారు. ఈ రెండు పథకాలను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని అనుబంధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి సుమారు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉండగా, దీనిని కనీసం 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపాలని పవన్‌ పేర్కొన్నారు. మడ, సరుగుడు, తాటి చెట్లు వంటి మొక్కలను తీర ప్రాంతం మొత్తం విస్తరింపజేసి, తుపానులు, వరదలు వంటి విపత్తుల నుంచి తీర ఆవాసాలకు భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Read Also: MSVG: “రౌడీ అల్లుడు వైబ్ తిరిగి తెచ్చాం!” – మెగాస్టార్ వింటేజ్ ఫుల్ ప్యాక్ సినిమా ఇదే!

ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. మొదటి దశ: కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూముల్లో విస్తృతంగా మొక్కలు నాటడం.. రెండో దశ: తీరానికి సమీపంలోని రోడ్లు, కాలువలు, డొంకల పక్కన మొక్కలు పెంచడం.. మూడో దశ: వ్యవసాయ భూముల్లో రైతులకు ఆర్థికంగా ఉపయోగపడే మొక్కల పెంపకం ప్రణాళికలు రూపొందించడం అని పేర్కొన్నారు.. తీర ప్రాంతం వెంబడి ప్రస్తుతం అటవీ శాఖ 402 కిమీ పరిధిలో 500 మీటర్ల వెడల్పున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ప్రాజెక్టు విస్తరణకు ముందుగా.. కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ (CRZ) పరిధిలో ఉన్న భూమి ఎంత?.. అందులో అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది?.. ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతిలో ఉన్న భూమి ఎంత?.. అన్న అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు.

ఇక, శాటిలైట్‌ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల నోటిఫై కాని మడ అడవులను గుర్తించామని, వీటిని అధికారికంగా నోటిఫై చేసి అటవీ శాఖకు అప్పగించే చర్యలు జరుగుతున్నాయని పవన్‌ వెల్లడించారు. అయితే, నోటిఫికేషన్‌ పూర్తయ్యేలోపు ఆ భూముల్లో ఆక్రమణలు జరగకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.. తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధం బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకే అప్పగించాలని, మొక్కల భద్రతలో స్థానికులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ వాల్‌ ప్రాజెక్టు అవసరంపై ప్రజా ప్రతినిధులు, నాయకులు, తీర ప్రాంత ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పథకాల అమలుకు గ్రీన్‌ క్లైమెట్‌ ఫండ్‌, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు.. వంటి వనరులను సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపక ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.

మరోవైపు.. సమీక్ష అనంతరం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పంట పొలాల మధ్య రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పండ్ల తోటలు అధికంగా ఉన్న నేపథ్యంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తే మార్కెటింగ్‌ సదుపాయాలు మెరుగవుతాయని వివరించారు. దీనిపై స్పందించిన పవన్‌.. గ్రామీణ రహదారుల అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు

Exit mobile version