Site icon NTV Telugu

Iftar Party: రాష్ట్రస్థాయి, జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్‌ విందులు.. ఏర్పాట్ల కోసం నిధులు విడుదల..

Iftar Party

Iftar Party

Iftar Party: రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ముస్లిం మైనారిటీలకు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు రానున్న 4, 5 రోజులలో జిల్లా స్థాయి ఇఫ్తార్ కార్యక్రమాన్ని వారికి అనువైన రోజున నిర్వహిస్తారు. ఇఫ్తార్ ను జిల్లాస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్లు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా, మనోరంజకంగా నిర్వహించాలని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశించారు.

రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కు రూ.75 లక్షలు
విజయవాడ ఏ- కన్వెన్షన్ సెంటర్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేయబోయే రాష్ట్రస్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి రూ.75 లక్షలు మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇఫ్తార్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన రూ. 1.50 కోట్లు మొత్తంలో రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ నిర్వహణ కు పోను, మిగతా రూ. 75 లక్షలు మొత్తాన్ని జిల్లాల వారీగా కేటాయించి ఆయా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇఫ్తార్ నిర్వహణకు నిధులు కేటాయిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లకు, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులకు నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పడం జరిగిందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. వివిధ వర్గాల ప్రజలు ఇఫ్తార్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రజలందరిలో మత సామరస్యం, సోదరభావం, ఐక్యతాభావం పెంపొంది, తద్వారా సమాజ పురోగతి మరింత ముందుకు సాగుతుందని మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.

Exit mobile version