Site icon NTV Telugu

Amaravati Legal Status: అమరావతికి చట్టబద్ధత.. నేడు పార్లమెంట్‌ ముందుకు బిల్లు..

Amaravati Legal Status

Amaravati Legal Status

Amaravati Legal Status: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ రోజు లోక్‌సభలో ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ ఇప్పటికే స్పీకర్ కార్యాలయానికి సమాచారం అందించింది. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న రాజధాని సందిగ్ధతకు ముగింపు పలికేలా, అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించడం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర హోం శాఖ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. గత కొంతకాలంగా రాజధాని విషయంలో కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులు, రాజకీయ సందిగ్ధతలకు ఈ సవరణతో శాశ్వతంగా తెరపడనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ద్వారా APCRDA పరిధిలోని ప్రాంతమంతా అమరావతిగా గుర్తించబడుతుంది.

Read Also: Cylinder Price Hike: ఏప్రిల్ 1న కేంద్రం షాక్.. భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర

ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ సవరణ బిల్లుకు అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ఏపీ రాజధాని అమరావతి హోదాపై ఉన్న న్యాయపరమైన, సాంకేతిక పరమైన చిక్కులు తొలగిపోయి.. కేంద్రం నుంచి అందే నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమం కానుంది. ఏపీ రాజకీయాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో ఈ బిల్లు అత్యంత కీలకం కానుంది. గత కొన్నేళ్లుగా అమరావతి రాజధాని విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఈ పార్లమెంటు బిల్లుతో ఒక స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఏపీ ప్రజలు, అమరావతి రైతులు ఈ పరిణామంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉంటుందని చెప్పారు. అమరావతి అనే పేరును స్పష్టంగా పొందుపరచలేదు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన 3 రాజధానుల గందరగోళం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే, విభజన చట్టంలోనే అమరావతి పేరు ఉండాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సెక్షన్ 5(2) కు సవరణ కోరుతూ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర హోం శాఖకు పంపిచింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. సాధారణంగా ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే… ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయం కారణంగా ఈ ప్రక్రియ వేగంగా జరిగింది. కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత, దీనిని ఒక సవరణ బిల్లు రూపంలో పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. మొదట లోక్‌సభ, తర్వాత రాజ్యసభ ఈ బిల్లును ఆమోదిస్తాయి.

పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు అధికారికంగా చేరుతుంది. దీనివల్ల అమరావతికి చట్టబద్ధమైన హోదా లభిస్తుంది. ఈ చట్టపరమైన రక్షణ వల్ల భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, పార్లమెంట్ చట్టాన్ని మార్చకుండా రాజధానిని మార్చడం సాధ్యం కాదు. ఇది అమరావతి ప్రాంత రైతులకు, అక్కడ పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు భరోసా కల్పిస్తుందనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిని రాష్ట్ర అధికారిక రాజధానిగా స్థిరపరుస్తూ, దానికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. మొదట లోక్‌సభ, తర్వాత రాజ్యసభలో ఆమోదం అనంతరం ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. << Roll PKG

Exit mobile version