Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే

Dangerous School Journey

Dangerous School Journey

Dangerous School Journey: ఆస్తులు లేకున్నా సరే.. మంచి చదువు ఉంటే.. అది మిమ్మల్ని.. ఆస్తిపరులను చేస్తుంది.. అయితే, ఆ చదువు కోసం ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. సాహసం చేయాల్సి వస్తుంది.. చదువుకోవాలంటే సాహసం చేయాల్సిన పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో నెలకొంది. పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారులు ప్రతిరోజూ ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థుల రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయి.

జీకే వీధి మండలం తామరపు లోవ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో చిన్నారులు ప్రాథమిక విద్య కోసం దాదాపు రెండు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తున్నారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో ఉన్న వాగు దాటాల్సి రావడంతో వర్షాలు కురిసిన సమయంలో వారి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోనే విద్యార్థులు వాగును దాటుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాగు దాటే సమయంలో ఏమాత్రం కాలుజారినా ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని, చదువు కోసం తమ పిల్లలు ఇలాంటి ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

గ్రామస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అత్యవసర వైద్యం, నిత్యావసర సరుకుల కోసం వాగు దాటుతూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహించినప్పుడు గ్రామానికి రాకపోకలు మరింత కష్టతరంగా మారుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని తామరపు లోవ గ్రామస్తులు కోరుతున్నారు. వాగుపై వంతెన నిర్మించడంతో పాటు గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించి విద్యార్థులు, గ్రామస్తులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.