NTV Telugu Site icon

Vontimitta Kodandarama Kalyanam: ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Vontimitta

Vontimitta

Vontimitta Kodandarama Kalyanam: సాధారణంగా సీతారాముల కల్యాణం శ్రీరామ నవమి రోజు జరుగుతుంది.. కానీ, భక్తులు ఆంధ్ర భద్రాదిగా భావించే ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మాత్రం.. పండు వెన్నెల్లో కన్నుల పండుగగా కోదండరాముని కల్యాణం నిర్వహిస్తారు.. ఈ మహోత్సావానికి ఇప్పటికే టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇవాళ రాత్రి కోదండ రాముడి కల్యాణ క్రతువుకు శాస్త్రోక్తంగా నిర్వహించబోతున్నారు.. లక్ష మంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.. అయితే, షెడ్యూల్‌ ప్రకారం సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ ఒంటిమిట్టకు రావాల్సి ఉన్నా.. కాలికి గాయం కారణంగా ఆయన పర్యటన రద్దు కావడంతో.. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి లేదా టీటీడీ ఛైర్మన్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేసేలా ఏర్పాటు జరుగుతున్నాయి..

Read Also: London School of Economics: భారతీయుడు-హిందూ అంటే ద్వేషం.. ఓ స్టూడెంట్ ఆవేదన

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి.. రాత్రికి పండు వెన్నెల్లో కోదండ‌రాముని కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, ఉద‌యం జ‌గ‌ద‌భిరాముని ఊరేగింపు నిర్వహిస్తారు.. ఒంటిమిట్టలో శ్రీరాముడి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. స‌ర్వాంగ సుంద‌రంగా కల్యాణవేదికను ముస్తాబు చేశారు.. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఒంటిమిట్టలో కల్యాణం నేప‌థ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. కడప-తిరుపతి ప్రధాని రహదారికి పక్కనే ఈ ఆలయం ఉండడంతో.. ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంటల త‌రువాత క‌డ‌ప‌- తిరుప‌తి ప్రధాన ర‌హ‌దారిలో రాక‌పోక‌లు నిలిపివేయనున్నారు.. తిరుప‌తి నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను రాయ‌చోటిమీదుగా క‌డ‌ప‌కు, క‌డ‌ప నుంచి తిరుప‌తికి వెళ్లే వాహ‌నాలను రాయ‌చోటి మీదుగా దారి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి నిర్వహించే సీతారాముల కల్యాణానికి 52 ఎకరాల విస్తీర్ణంలోని శాశ్వత కల్యాణ వేదికలో దాదాపు లక్షమంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. పండువెన్నెల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకు కల్యాణ క్రతువును కన్నుల పండుగ నిర్వహించబోతున్నారు.. పురాణాల ప్రకారం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కల్యాణం చేసుకుంటారని వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం కాంతకోరిక పేరుతో కార్యక్రమం నిర్వహించే పండితులు.. ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. 11 వ శతాబ్దం నుంచి ఇక్కడ కోదండరాముడికి విశేష పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, కోదండరాముడి కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో.. ఇతర ప్రాంతాల నుంచి ఒంటిమిట్టకు ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.