Vijayawada: ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. ఈ మేరకు విజయవాడలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలో న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు స్పందించడంలేదంటూ అగ్రిగోల్డ్ బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు
బాధితులు చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని అగ్రిగోల్డ్ బాధితులు ఆరోపించారు. ఇచ్చిన హామీ ప్రకారం చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసి ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకున్నారని.. వాటిని విడిపించి బాధితులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. మోసం చేసిన వారికి సీఎం జగన్ పది సార్లు అపాయింట్‌మెంట్ ఇస్తారా? బాధితుల పక్షాన మేము వెళితే కలవరా? ఇదేనా మాట తప్పం, మడమ తిప్పం అంటే అంటూ ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అగ్రిగోల్డ్‌లో తమ డిపాజిట్లు పెట్టి మోసపోయామని.. ఈ కారణంగా తమ అమ్మాయిల వివాహాలు జరిపించలేని దుస్థితిలో ఉన్నామని, ఇకనైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తమను ఆర్థికంగా ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
