A Young Man Got Killed Becuase Of Extramarital Affair in Anantapur: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ కూడా ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని, తన జీవతాన్ని సర్వనాశనం చేసుకుంది. ఓ యువకుడి హత్యకు కూడా కారణమైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన స్వామి నాయక్, మంగమ్మలకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీళ్లు గుంతకల్లులోని చైతన్య థియేటర్ సమీపంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్వామినాయక్ డ్రైవర్ కావడంతో.. వృతి రీత్యా ఎక్కువ రోజులు హైదరాబాద్‌లోనే ఉంటాడు. కుటుంబ పోషణకు డబ్బు పంపించేవాడు. ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చి, తిరిగి హైదరాబాద్ వెళ్లేవాడు. స్వామినాయక్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటాడు కాబట్టి.. ఇంటి పనుల కోసం స్వామినాయక్ చిన్నాన్న కుమారుడు సుంకేనాయక్ తరచూ మంగమ్మ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త ఇంట్లో లేనప్పుడు.. వీళ్లు ఏకాంతంగా సమయం గడిపేవారు.
బుధవారం కూడా పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత.. మంగమ్మ ఇంటికి సుంకేనాయక్ వచ్చాడు. అయితే.. అదే సమయంలో స్వామినాయక్ కూడా ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బెడ్రూమ్‌లో సుంకేనాయక్, మంగమ్మ ఏకాంతంగా ఉండడం గమనించాడు. దాంతో కోపాద్రిక్తుడైన స్వామినాయక్, వెంటనే కత్తితో సుంకేనాయక్‌పై దాడి చేశాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. భర్తని అడ్డుకోవడానికి భార్య మంగమ్మ ప్రయత్నించగా.. ఆమెపై కూడా దాడి చేశాడు. తలపై గట్టిగా బాదాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనలో సుంకేనాయక్ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మంగమ్మని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.