A Young Boy Died In Devaragattu Bunny Festivals And More Than 50 Injured: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. కర్రల సమరాన్ని చూసేందుకు వచ్చిన ఓ యువకుడు మృతి చెందాడు. అతడు గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు తెలిసింది. మరోవైపు.. జోరుగా వర్షం కురిసినప్పటికీ, ఆ వర్షంలోనే బన్నీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 10 గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు కర్రలతో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్ని చూసేందుకు దాదాపు 2 లక్షల మంది జనం తరలివచ్చారు. వీళ్లు కూడా వర్షంలోనే తడుస్తూ.. ఈ ఉత్సవాలను తలకిస్తున్నారు. కాగా.. ఈ కర్రల సమరంలో 50 మందికి గాయాలైనట్టు సమాచారం. పలువురు తలలు పగిలాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
ఇదిలావుండగా.. దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన మాల మల్లేశ్వరస్వామికి ప్రతీ ఏటా దసరా సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవాలనే కర్రల సమరంగా పేర్కొంటారు. ఈ సమరంలో 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి.. స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు కర్రలతో దాడులు చేసుకుంటారు. ఈ సందర్భంగా చాలామంది గాయపడటం, కొందరు ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది. ఈ ఉత్సవాలను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల వారితో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనాలు భారీగా హాజరవుతారు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఈ ఉత్సవాల్లో రక్తపాతం జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ.. జనాలు వారిని పట్టించుకోకుండా కర్రల సమరంలో పాల్గొన్నారు. ఇది తమ సంప్రదాయంలో భాగమని, కర్రల సమరాన్ని వదిలేదే లేదని అక్కడి జనాలు అంటున్నారు.
దేవరగట్టు చుట్టూ దాదాపు 50 గ్రాములు ఉండగా.. వాటిల్లో నెరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఈ ఉత్సవాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. అమావాస్య నుంచి దీక్ష చేపట్టి.. బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరనికి గ్రామానికి చేరేవరకు.. కాళ్లకు చెప్పులు వేసుకోకుండా, మద్యం – మాంసం ముట్టుకోకుండా పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తారు. ఈ ఉత్సవాల్ని పర్యవేక్షించడం కోసం పోలీసులు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల్ని ఏర్పాటు చేశారు.