NTV Telugu Site icon

Vizag Theft Case: వీర వనిత.. కత్తితో పొడిచినా, నలుగురు దుండగుల్ని ప్రతిఘటించింది

Woman Fought With Robbers

Woman Fought With Robbers

A Married Woman Fought With 4 Robbers In Vizag: ఆమె ఒక్కతే.. వాళ్లు నలుగురు. పైగా వారి చేతిలో కత్తులున్నాయి. అయినా సరే, ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా, వారిని ప్రతిఘటించింది. తీవ్ర గాయాలపాలైనా, లెక్క చేయకుండా వీర వనితలా ఎదురించింది. చివరికి వారి నుంచి తప్పించుకొని, ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తిలోని చీమలపల్లిలో ఉన్న చెరువుగట్టు ప్రాంతంలో ఆళ్ల అప్పారావు అనే కుటుంబం నివసిస్తోంది. ఆయన తన భార్య లలితకుమారి, ఇద్దరు కుమారులు (వినయ్‌కుమార్‌, అవినాష్‌కుమార్‌) కలిసి ఉంటున్నారు. ఆయన కుమార్లో ఒకరైన అవినాష్‌కు ఇటీవల లావణ్యతో వివాహం అయ్యింది. మంగళవారం రాత్రి ఎప్పట్లాగే అవినాష్ విధులకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఓ గదిలో ఉండగా.. మరొక గదిలో లావణ్య ఒక్కతే నిద్రిస్తోంది.

కట్ చేస్తే.. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో, నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చారు. ఇంటి కిటికీ గ్రిల్‌ను తొలగించి.. లోపలికి ప్రవేశించారు. అప్పటివరకూ చప్పుడు కాకుండా, జాగ్రత్తగా లోనికి వెళ్లారు. అత్త, మామయ్య, బావ పడుకున్న గదికి బయట నుంచి గడియ పెట్టేశారు. లావణ్య గది తలుపుని బద్దలుకొట్టి.. లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ శబ్దానికి లావణ్య నిద్ర లేచింది. లావణ్య నిద్రలేచిన విషయం గమనించిన దుండగులు.. ఆమెని బందింఛేందుకు ప్రయత్నించారు. కానీ.. లావణ్య వారికి దొరక్కుండా తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో వాళ్లు ఆమెపై కత్తితో దాడి చేశారు. అయినా లెక్క చేయకుండా.. వారిని ఎదుర్కొని, గదిలో నుంచి బయటకు వచ్చి, గట్టిగా కేకలు వేసింది. అత్త, మామ, బావ పడుకున్న గదికి గడియ వేయడంతో.. వాళ్లు బయటకు రాలేకపోయారు. అయితే.. లావణ్య అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే ఆ దుండగులు పారిపోయారు.

తీవ్ర గాయాలపాలైన లావణ్యను.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ కేసులో పోలీసులు కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న గదికి బయటి నుంచి గడియ వేయడం, లావణ్య ఉన్న గదిలోకే దుండగులు రావడం, ఆమెపై కత్తితో దాడులు చేయడంతో.. ఎవరైనా కుట్ర పన్ని ఈ దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారిస్తున్నారు.