దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా షర్మిల రాజకీయ అరంగ్రేటం చేసింది. తన తండ్రిలాగే ఆమె కూడా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలను ఎంచుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లుగా సీఎంగా ఉండగా రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య నవ్యాంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఈ క్రమంలోనే షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీకి కోసం పని చేశారు. అనంతరం ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి సొంతంగా ముందుకెళుతున్నారు.
– జగనన్న వదిలిన బాణం..
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి నాడు తొలినాళ్లలో షర్మిల దూసుకెళ్లారు. వేల కిలోమీటర్ల పాదయాత్రను అవలీలగా పూర్తిచేసి రికార్డు సృష్టించారు. కిందటి ఎన్నికల్లో ఏపీలో వైఎస్సాఆర్సీపీ అధికారంలోకి రాగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఆ పార్టీలో ఆమెకు ఏదైనా కీలక పదవి దక్కుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. ఏమైందో ఏమో తెలియదుగానీ ఆమె సొంతంగా ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఏపీని కాదని తెలంగాణ ప్రాంతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడి వారి సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యమంటూ షర్మిల స్పష్టం చేస్తున్నారు.
– ఆరునెలల్లో..
తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టి దాదాపు ఆరునెలల కావస్తోంది. ఈ ఆరునెలల కాలంలో ఆమె ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువకుల ఆత్మహత్యలు, రైతు, మహిళా సమస్యలపై ఆమె ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. ఆయా వర్గాలను ఆకట్టుకునేలా ప్రణాళికలను సిద్ధం చేసుకొని సాగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు యువత నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాజన్న కూతురుగా షర్మిలకు తెలంగాణవాసులు ఆదరిస్తున్నారు.
– రాజకీయ శక్తిగా..
వచ్చే ఎన్నికల్లో ఆపార్టీ అధికారంలోకి వస్తుందో రాదో చెప్పడం కష్టమే. కానీ ఆమె మొక్కవొని ధైర్యం చేస్తుంటే తెలంగాణలో కీలక శక్తిగా ఎదుగుతారనే నమ్మకాన్ని కలుగజేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిలోని ధైర్యం, పట్టుదల షర్మిలలోనూ కన్పిస్తున్నాయి. ఈ లక్షణాలే ఆమెను తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తున్నాయి. ఆమె సైతం వచ్చే ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి కావాలని భావించడం లేదు. తెలంగాణ పార్టీని బలంగా నిలబెట్టాలని భావిస్తున్నారు. అందుకుగుణంగా తగిన కార్యచరణతో ముందుకెళుతున్నారు.
-పాదయాత్రకు శ్రీకారం..
అక్టోబర్ 20 నుంచి పాదయాత్రకు షర్మిల శ్రీకారం చుట్టబోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక ఏడాదిపాటు ఆమె పాదయాత్ర కొనసాగునుంది. మొత్తం 90 నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఆమె పార్టీపై ఎవరెన్ని విమర్శలు చేసినా వాటిని ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. తను ఏదైతే లక్ష్యంతో బరిలో దిగుతున్నారో దానిపైనే ఆమె ఫోకస్ పెడుతున్నారు.
-కింగ్ మేకర్..
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కింగ్ మేకర్ గా వైఎస్ఆర్టీపీ మారాలని భావిస్తోంది. తనకు వయస్సు తక్కువ కావడంతో రాజకీయంగా భవిష్యత్ బాగానే ఉంది..పైగా చరిష్మా ఉంది.. పోరాటం చేసే సత్తా ఉందని షర్మిల నమ్ముతోంది. ఎప్పటికైనా తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాననే ఆశను షర్మిల వ్యక్తం చేస్తున్నారు. మరీ ఆమె లెక్క ఏమేరకు వర్కౌట్ అవుతుందో వేచిచూడాల్సిందే..!
