Site icon NTV Telugu

వాళ్లే జగన్ బలం.. కలిసొచ్చే అంశాలేంటి?

YS Jagan

YS Jagan

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ముందస్తు ఎన్నికల ప్రచారమే జరుగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎలాగైతే ముందుస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారో? అదే రీతిన సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని టాక్ విన్పిస్తోంది. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నపుడు ఎన్నికలకు వెళితే గెలుపు తథ్యమని కేసీఆర్ నిరూపించారు. ఈ ఫార్మూలాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రయోగించే అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు ముందస్తుగానే అలర్ట్ అవుతున్నాయి.

గత కొద్దిరోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులకు ముందస్తు ఎన్నికలపై దిశ నిర్దేశం చేసినట్లు వార్తలు వచ్చాయి. నేతలంతా ఎన్నికల మూడ్ లోకి వెళ్లాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాదిలో పీకే రంగంలోకి దిగుతారని.. వారితో కలిసి పని చేయాలని ఆదేశించినట్లు ప్రచారం జరిగింది. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని అంతా భావిస్తున్నారు. ఒకవేళ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఆయన గెలుపును డిసైడ్ చేసేది ఏంటనే చర్చ సైతం జోరుగా నడుస్తుంది.

వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేన్నరేళ్లు కావస్తోంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకు సాగుతున్నారు. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జగన్ రెండేళ్ల పాలనపై ఇటీవల ఓ సర్వే నిర్వహించగా మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇటీవల ఏపీలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏపీలో ఎక్కడ ఎలాంటి ఎన్నిక జరిగినా ప్రజలు వైసీపీకే పట్టం కడుతున్నారు. దీంతో జగన్ పాలనకు జనం జై కొడుతున్నట్లు అర్ధమవుతోంది.

మరోవైపు ప్రతిపక్ష టీడీపీ కనీసం వైసీపీకి పోటీ ఇవ్వలేకపోతుంది. ఏపీలోని జెడ్పీలు, ఎంపీపీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు అన్ని ఇప్పటికే వైసీపీ వశమైపోయాయి. వీరి పదవీ కాలం ఐదేళ్లు ఉండనుంది. అధికారం మారితే వీరికి తిప్పలు తప్పవు. దీంతో వీరంతా జగన్ తో కలిసి నడిచే అవకాశం  ఉందని తెలుస్తోంది. అలాగే నామినేటేడ్ పదవులు దక్కించుకున్న నేతలు సైతం అధికారాన్ని కాపాడుకునేందుకు కృషి చేసే అవకాశం ఉంది. ఒకవేళ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ కు వీరంతా అండగా నిలిచే అవకాశాలు మొండుగా ఉన్నాయి. అందుకే జగన్ కొంతకాలంగా ఏపీలో పదవుల పందేరాన్ని పెట్టినట్లు తెలుస్తోంది.

పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది. జిల్లాలన్నీ కూడా సీఎం జగన్ కనుసన్నల్లోనే ఉన్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకోవాలంటే సంక్షేమంతోపాటు జిల్లాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పూర్తికావడంతో జగన్ దృష్టంతా అసెంబ్లీ ఎన్నికలపైనే ఉంది. ఒకవేళ ముందస్తుకు వెళ్లినా ఆయనకు స్థానిక నేతలే బలంగా నిలిచే అవకాశం ఉండనుంది. వీరంతా సమిష్టిగా కృషి చేస్తే జగన్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ సీఎం జగన్ ముందస్తుకు వెళుతారో లేదో వేచిచూడాల్సిందే..!

Exit mobile version