Site icon NTV Telugu

రాహుల్’ వాయిదాల పర్వం.. కాంగ్రెస్ కు వరమా.. శాపమా?

Rahul Gandhi

దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదంటే అతిశయోక్తి కాదేమో. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ కేంద్రంలో అధికారాన్ని కోల్పోవడం ఆపార్టీపై తీవ్రంగా ప్రభావాన్ని చూపుతోంది. క్రమంగా రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పట్టుకోల్పోతుండటంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆపార్టీకి కీలకంగా మారాయి. అయితే మోదీ-అమిత్ షా హవా ముందు కాంగ్రెస్ వ్యూహాలు పని చేయడం లేదని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీని ఎలా గాడిన పెడుతుందనేది ఆసక్తిని రేపుతోంది.

యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీని సోనియాగాంధీ నడిపించారు. దశాబ్దకాలానికి పైగా ఆమె కాంగ్రెస్ అధ్యక్ష పదవీలో కొనసాగుతున్నారు. వయస్సు పైబడటం, అనారోగ్య కారణాలతో ఆమె ఆ పదవీ నుంచి తప్పుకొని రాహుల్ గాంధీకి ఆ బాధ్యతను అప్పగించారు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నుంచి తప్పుకున్నారు. నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేకుండా పోయారు. నాటి నుంచి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

ఇదే అదునుగా కాంగ్రెస్ లోని 23మంది సీనియర్లు పార్టీకి వ్యతిరేకంగా పావులు కదపడం ఆపార్టీలో కలకలాన్ని సృష్టించింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారంతా డిమాండ్ చేస్తూ అప్పట్లో లేఖాస్త్రాన్ని సంధించారు. అయితే రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ సీనియర్లతో చర్చించి వివాదం సర్దుమణిగేలా చేశారు. కాగా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీలో లేకపోయినా ఆయన చెప్పిన విధానంగానే పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. తాజాగా సీడబ్ల్యూసీ సమావేశం జరుగగా అధ్యక్ష ఎన్నికపైనే ప్రధానంగా చర్చ జరిగింది.

సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీని అధ్యక్ష పదవీ కోసం సీనియర్లు ప్రతిపాదించగా ఆయన దాటేవేసే ప్రయత్నం చేశారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో సోనియాగాంధీనే అధ్యక్ష పదవీని చేపట్టారు. 2022 వరకు తానే అధ్యక్ష పదవీ ఉండబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఆమె తరువాత అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టేలా సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అయితే రాహుల్ గాంధీ మాత్రం గతంలో కంటే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. పార్టీకి సంబంధించిన కీలక విషయాలు మినహా అన్ని రాహుల్ గాంధీనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భుజన మోస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ఎన్నికల్లో సక్సస్ అవుతుందని ఆపార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రాహుల్ అధ్యక్ష పదవీలో లేకున్నప్పటికీ అనధికారికంగా ఆయన మాటే కాంగ్రెస్ లో శాసనంగా నడుస్తోంది. దాదాపు 90శాతం కాంగ్రెస్ నేతలు ఆయన నాయకత్వానికే మద్దతు తెలుపుతున్నారు. అయినా ఆయన అధ్యక్ష పదవీ చేపట్టేందుకు నిరాకరిస్తుండటం గమనార్హం. అయితే రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ వరమా? లేదంటే శాపమా? అనేది మాత్రంలో భవిష్యత్తులో తేలనుంది.

Exit mobile version