NTV Telugu Site icon

Telugu Language: తల్లి భాషలో.. తగ్గిన ఉత్తీర్ణత. ‘పది’ ఫలితాలందు తెలుగు ‘లెస్‌’.

Telugu Language

Telugu Language

‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని శ్రీకృష్ణదేవరాయలు గొప్పగా చెప్పగా తెలంగాణలో ఇది రివర్స్‌ అయింది. పదో తరగతి ఫలితాలందు తెలుగు ‘లెస్‌’ అని రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో మాతృభాష తెలుగు అని అందరికీ తెలిసిందే. పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కూడా తెలుగే. కానీ మొన్న విడుదలైన టెన్త్‌ రిజల్ట్స్‌లో మాత్రం తెలుగు బాగా వెనకబడింది. పాస్‌ పర్సంటేజ్‌లో లీస్టుకి పడిపోయింది. తెలుగు భాషలో ఉత్తీర్ణత శాతం 95.74కే పరిమితమైంది. సెకండ్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌తోపాటు సోషల్‌ సబ్జెక్టులో కూడా 99 శాతం మంది విద్యార్థులు పాసవటం గమనార్హం.

టెన్త్‌ ఎగ్జామ్స్‌ అంటే ఒకప్పుడు లెక్కల సబ్జెక్టును చూసి గానీ సైన్స్‌ సబ్జెక్టును తలచుకొని గానీ స్టూడెంట్లు భయపడేవారు. అలాంటిది ఇప్పుడు తెలుగు సబ్జెక్టు కొరకరానికొయ్యలా మారింది. ఇతర సబ్జెక్టుల్లో 8 లేదా 9 జీపీఏ (గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌) సాధించే బ్రిలియంట్‌ స్టూడెంట్స్‌ సైతం తెలుగులో ఫెయిలయ్యారని స్కూల్‌ మేనేజ్‌మెంట్లు, టీచర్లు చెప్పారు. తెలుగులో తక్కువ మార్కులు రావటం వల్లే చాలా మంది విద్యార్థులు పదో తరగతి మొత్తమ్మీద 10 జీపీఏ పొందలేకపోయారని తెలిపారు. కరోనా సమయంలో ఎక్కువగా మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టుల పైనే ఫోకస్‌ పెట్టారని, అటు పేరెంట్స్‌, ఇటు స్కూళ్లు లాంగ్వేజెస్‌ని ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుని విస్మరించారని ఒక టీచర్‌ అన్నారు.

Kesineni Nani: క్షత్రియుల భవన నిర్మాణానికి రూ.65 లక్షలు కేటాయించిన టీడీపీ ఎంపీ

ఈ పరిస్థితుల్లో హైస్కూల్‌ స్టూడెంట్స్‌ సైతం తెలుగులో బేసిక్‌ పదాలను రాయటం, చదవటం చేయలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు. అందుకే రీసెంట్‌ రిజల్ట్స్‌లో చాలా మంది విద్యార్థులు తెలుగులో ఫెయిల్‌ అయ్యారని పట్టిచూపారు. 2018లో తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత శాతం 97.87 నమోదు కాగా 2019లో కాస్త మెరుగుపడి 98.73 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మరీ ఘోరంగా 95.74 శాతానికే పడిపోయింది. అయితే దీనికి కారణం తాము కాదంటూ కొన్ని స్కూళ్ల మేనేజ్‌మెంట్లు తప్పించుకుంటున్నాయి. ఆ నిందను తెలుగు టీచర్ల మీదికి నెట్టేస్తున్నాయి. వాళ్లు సమాధాన పత్రాలను కఠినంగా దిద్దటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తప్పుపడుతున్నాయి.

ఇతర సబ్జెక్టుల పేపర్లను ఆయా ఉపాధ్యాయులు కొంచెం చూసీచూడనట్లు దిద్దుతున్నా తెలుగు టీచర్లు మాత్రం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వై.శేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. మెజారిటీ విద్యార్థులు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా తెలుగునే సెలెక్ట్‌ చేసుకోవటం కూడా దీనికి ఒక కారణమని వివరించారు. చాలా పాఠశాలల్లో లాంగ్వేజ్‌ సబ్జెక్టులను అశ్రద్ధ చేశారని ఆయన ఒప్పుకున్నారు. కొన్ని స్కూళ్లల్లో తెలుగు లేదా హిందీ సబ్జెక్టుకి వారానికి మూడు పీరియడ్లు మాత్రమే కేటాయిస్తున్నారని, కొన్ని స్కూళ్లయితే పరీక్షలకు మూడు నెలల ముందు వరకు కూడా అసలు ఈ సబ్జెక్టుల బోధనను ప్రారంభించట్లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తెలుగు ఫైనల్‌ ఎగ్జామ్‌లో ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా కరెక్టుగా రాయలేకపోతున్నారని శేఖర్‌రావు అన్నారు.