కాలాన్ని సూచించడానికి మన పూర్వీకుల దగ్గరి నుంచి నేటి జనరేషన్ వరకు కూడా క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మాట్లాడేవాళ్లు. అయితే ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆ పిలుపుకు బ్రేక్ పడినట్లే కన్పిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ఎప్పుడైతే ఆ దేశాన్ని వీడి ప్రపంచానికి పాకిందో అప్పటి నుంచి కరోనా పేరు మార్మోమోగిపోయింది. ఇది సృష్టించిన బీభత్సం తలుచుకుంటేనే వెన్నులో వణుకుపట్టడం ఖాయం. కోవిడ్-19 ఎఫెక్ట్ తో ఇప్పుడంతా కరోనాకు ముందు(Before Corona).. కరోనాకు తర్వాత(After Corona) అని మాట్లాడుకుంటున్నారు.
భారత్ లోనూ కరోనా ఎఫెక్ట్ భారీగానే పడింది. భారతదేశం తొలివేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ లో చతికిలపడింది. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి రావడంతో కొద్దిరోజులుగా దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి నిలకడగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై అవగాహన కల్పించడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కరోనాకు దూరంగా ఉంటున్నారు. అయితే కొంతమంది ఇప్పటికీ కూడా కరోనా విషయంలో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తుండటం ఆందోళన రేపుతోంది.
ఇక ఏపీ విషయానికొస్తే కరోనా విషయంలో జగన్ సర్కార్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీనివల్లే ప్రస్తుతం ఏపీలో కరోనా కట్టడిలోకి వచ్చింది. కరోనా టీకా పంపిణీలో ఏపీ ముందంజలో ఉంది. కరోనా ఫస్టు డోస్, సెకండ్ డోసుల పంపిణీని పరిగణలోకి తీసుకుంటే కేరళ తొలిస్థానంలో ఉండగా ఏపీలో దేశంలో ఐదవ స్థానంలో ఉంది. ఏపీలో 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 3.47కోట్ల మంది అర్హులు ఉండగా వీరిలో మూడుకోట్ల మంది తొలి డోస్ పూర్తి చేసుకున్నారు. 1.66కోట్ల మంది సెకండ్ డోస్ తీసుకున్నట్లు సమాచారం.
టీకా విషయంలో ఏపీలో ఎలాగైతే రికార్డులను సృష్టిస్తూ ముందుకెళుతుందో కరోనా ఫైన్ల విషయంలో అలాంటి రికార్డులనే నమోదు చేస్తోంది. 2021 అక్టోబర్ చివరి నాటికి కరోనా నిబంధనలు పాటించని 44లక్షల33వేల798 మంది ప్రభుత్వానికి ఫైన్లు కట్టారు. వీటి ద్వారా ఏకంగా 31కోట్ల 87లక్షల 79వేల 993 రూపాయాలు జరిమానాల రూపంలో ప్రభుత్వానికి సమకూరాయి. కరోనా నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘించని వారిలో విశాఖ వాసులు ముందున్నారు. 11లక్షల42వేల మందిపై కరోనా కేసులు నమోదయ్యాయి.
అయితే కరోనా ఫైన్లు ఎక్కువగా కట్టిన జిల్లా మాత్రం చిత్తూరు. ఈ జిల్లా నుంచి ఏకంగా 6.02కోట్లు వసూలయ్యాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం, గుంటూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కోటికి పైగానే జరిమానా దాటాయి. మొత్తానికి ఏపీ కరోనా టీకా విషయంలోనే కాకుండా ఫైన్ల విషయంలో ముందుండటం విశేషం. ఏదిఏమైనా ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పకుండా పాటించి ఈ మహమ్మరిని తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
