Site icon NTV Telugu

కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం ఆశవాహుల ఎదురుచూపులు?

తెలంగాణలో మద్యం షాపులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు.. నష్టాల్లేని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క మద్యం వ్యాపారమేననే ప్రచారం ఉంది. మద్యం షాపు కోసం ఎంత పెట్టుబడి పెట్టినా అంతకు పదిరెట్లు లాభం వస్తుందనే నమ్మకం వ్యాపారుల్లో ఉంది. దీంతో మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులంతా క్యూ కడుతుంటారు. మద్యం షాపుల టెండర్లలో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి మద్యం షాపు దక్కిందా? ఇక తమ దశ తిరిగినట్లేనని భావించే వ్యాపారులు చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో..!

-దరఖాస్తు రుసుము 2లక్షలు..
ప్రతీ రెండేళ్లకోసారి మద్యం దుకాణాల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహిస్తోంది. మద్యం షాపులకు కిందటిసారి టెండర్లు నిర్వహించినపుడు దరఖాస్తు రుసుము రెండు లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. ఈ టెండర్లలో పాల్గొని మద్యం షాపులు దక్కించుకున్న వాళ్లు రెండేళ్లపాటు మద్యంషాపులు నిర్వహించుకునేలా ఎక్సైజ్ శాఖ లైసెన్స్ జారీ చేయనుంది. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల గడువు నవంబర్ తో ముగియనున్న నేపథ్యంలో డిసెంబర్ నుంచి కొత్త వారికి ఛాన్స్ లభించనుంది.

-త్వరలో కొత్త ఎక్సైజ్ పాలసీ..
హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన నియమ నిబంధనలు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. నూతన ఎక్సైజ్ పాలసీపై చర్చించి తమ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనిపై ప్రభుత్వం సమాలోచనలు చేసి నిర్ణయం ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ కోసం ఆశావహులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. దీంతో నవంబర్ తొలి వారం నుంచే మద్యం షాపులకు సంబంధించిన సందడి కన్పించే అవకాశముంది.

-‘ఫుల్’ డిమాండ్..
ఈసారి మద్యం షాపులు దక్కించుకున్న వారికి కాసుల పంటపండే అవకాశం కన్పిస్తోంది. మద్యం షాపుల నిర్వహణ కాలపరిమితి రెండేళ్లు ఉండనుంది. మరో ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోలాహాలం మొదలుకానుంది. దీంతో ఈసారి మద్యం షాపు టెండర్ దక్కితే పెద్దమొత్తంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉండనుంది. జనాభా పెరుగుదల, కొత్తగా ఏర్పడిన మండలాల ప్రాతిపదికన ఈసారి మద్యం దుకాణాల సంఖ్య స్వల్పంగా పెరుగనుందని సమాచారం. మరోవైపు కొత్త ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి నియమ, నిబంధనలు ఉంటాయనే ఉత్కంఠ నెలకొంది. ఏదిఏమైనా మద్యం షాపులపై వ్యాపారులంతా ‘కొండంత’ ఆశను పెట్టుకోవడం ఆసక్తిని రేపుతోంది.

Exit mobile version