Site icon NTV Telugu

Ayyappa song parody: పేరడీగా మార్చిన అయ్యప్ప భక్తి గీతం.. కేరళ ప్రభుత్వం సీరియస్

Untitled Design (14)

Untitled Design (14)

అయ్యప్ప భక్తి గీతాన్ని పేరడీగా మార్చిన ఘటనపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రూపొందిన ఈ పేరడీ పాటను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా పరిగణిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తులకు ఈ గీతాలకు విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నందున, వాటిని వినోదం లేదా వ్యంగ్య రూపంలో మార్చడం తగదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే ఈ అంశంపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే.. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఓ అయ్యప్ప భక్తి గీతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఆ భక్తి గీతాన్ని పేరడీగా మార్చి, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యంగ్యాత్మకంగా రూపొందించడం మరో వివాదానికి దారి తీసింది. నిత్యం దేవాలయాల్లో మార్మోగే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం ‘పొట్టియే కెట్టియే’ పాట ఆధారంగా ఈ పేరడీ పాటను రూపొందించడంతో వివాదం మరింత ముదిరింది. దీనిని మత విశ్వాసాలను అవమానించడం, ప్రజలను ఘర్షణలకు ప్రేరేపించడమేనని ఆరోపిస్తూ కేరళ పోలీసులు బుధవారం ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తిరువాభరణపథ సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కుళికల సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింది. ఈ వ్యవహారంలో రచయిత జీపీ కున్హబ్దుల్లా చలప్పురం, గాయకుడు డానిష్ ముహమ్మద్, వీడియోను చిత్రీకరించిన సీఎంసీ మీడియా, నిర్మాత సుబైర్ పంతులూర్‌లపై పోలీసులు కేసులు పెట్టారు.

అయ్యప్ప పేరడీ సాంగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. సీపీఐ(ఎం) పేరడీకి భయపడుతోందని ప్రతిపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. గతంలో కూడా అయ్యప్ప భక్తి పాటలను పేరడీ రూపంలో ట్యూన్ చేసిన సందర్భాలు ఉన్నాయని, అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది.

Exit mobile version