US Tailor Income: అమెరికాలో టైలరింగ్ (కుట్టుపని) వృత్తికి ఉన్న డిమాండ్, అక్కడ దర్జీలు సంపాదించే ఆదాయంపై సోషల్ మీడియాలో తాజగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అమెరికాలో నివసిస్తోన్న భారతీయ మహిళ కోమల్ పాండే ఒక స్పెషల్ వీడియో ద్వారా అక్కడి టైలరింగ్ వాస్తవాలను, సంపాదన వివరాలను పంచుకున్నారు. అమెరికాలో ఈ వృత్తిని కేవలం గౌరవప్రదంగానే కాకుండా, అత్యంత లాభదాయకమైన ఆదాయ వనరుగా కూడా పరిగణిస్తారని ఆమె ఈ వీడియోలో వెల్లడించారు. భారతదేశంలో ఒక టైలర్ రోజంతా కష్టపడితే వచ్చే ఆదాయాన్ని, అమెరికాలో కేవలం ఒకే ఒక్క గంటలో సంపాదించవచ్చని ఈ వీడియోలో కోమల్ తెలిపారు. అమెరికాలో ఒక నిపుణుడైన టైలర్ గంటకు సగటున 25 డాలర్లు సంపాదిస్తారట. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,200 నుంచి రూ.2,300 అన్నమాట. కుట్టుపని లేదా ఆల్టరేషన్స్ (దుస్తుల మార్పులు) లో మంచి అనుభవం ఉన్నవారికి అమెరికాలో నిరంతరం అవకాశాలు లభిస్తూనే ఉంటాయని ఆమె పేర్కొన్నారు.
చిన్న ఆల్టరేషన్‌కు రూ.4,000 బిల్లు!
ఇండియాలో బట్టల ఫిట్టింగ్ లేదా చిన్నచిన్న మార్పులను కేవలం వంద రూపాయల్లోనే చెల్లిస్తారు. కానీ అమెరికాలో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందట. ఉదాహరణకు ఒక సాధారణ జీన్స్ ప్యాంటు పొడవును తగ్గించాలన్నా (Alteration) లేదా ఫిట్టింగ్ మార్చాలన్నా కస్టమర్లు ఏకంగా 40 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుందట. ఇండియాన్ రూపీలో ఇది సుమారు రూ.3,500 నుంచి రూ.4,000 వరకు ఉంటుందట. అమెరికాలో టైలర్లకు ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటానికి గల కారణాన్ని కూడా కోమల్ వివరించారు. అక్కడ మెజారిటీ ప్రజలు రెడీమేడ్ దుస్తులనే కొనుగోలు చేస్తారట. అయితే ఈ రెడీమేడ్ బట్టలు అందరి సరిగ్గా సరిపోవు. దాంతో కచ్చితమైన ఫిట్టింగ్ కోసం వినియోగదారులు తప్పనిసరిగా టైలర్లను ఆశ్రయించాల్సి వస్తుందట. ఈ కారణంగానే అక్కడ దర్జీలకు, ఆల్టరేషన్ నిపుణులకు ఏడాది పొడవునా పనికి కొరత ఉండదని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

