ఎంపీ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను తాడేపల్లికి పిలిచిన వైసీపీ పెద్దలు.. రాజమండ్రి వైసీపీ పంచాయితీకి చెక్ పెడతారా? ఇద్దరికి సర్దిచెబుతారా.. చీవాట్లు పెడతారా? తాడోపేడో తేల్చుకోవాలని చూస్తోంది ఎవరు?
తాడేపల్లి నుంచి ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజాలకు పిలుపు..!
రాజమండ్రి వైసీపీలో ఎంపీ భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య కొద్దిరోజులుగా నెలకొన్న ఆధిపత్య పోరుకు ఫుల్‌స్టాప్ పెట్టడానికి పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇద్దిరినీ తాడేపల్లికి పిలిచారు. ముందుగా ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఇద్దరు యువనేతలతో భేటీ అవుతారట. తర్వాత ఇద్దరినీ సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్తారని సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి రాజమండ్రితోపాటు తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో ఉత్కంఠ నెలకొంది.
ఇద్దరిపైనా అధిష్ఠానం సీరియస్?
నిఘావర్గాల నివేదిక ఆధారంగా చర్యలు?
గత పంచాయితీల మాదిరి ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజాలకు సర్దిచెప్పి పంపిస్తారా? లేక వార్నింగ్ ఇచ్చి సైలెంట్ చేస్తారా అన్నది చర్చగా మారింది. పార్టీ పరువు బజారున పడేసేరని ఇద్దరిపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు టాక్. అందుకే ఈ యువ నేతలిద్దరికీ సీఎం జగన్ చీవాట్లు పెడతారని ఒక వర్గం వాదన. ఒకేపార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉంటూ వైరిపక్షాల మాదిరి విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు చేసుకోవడం వైసీపీలో చర్చగా మారింది. వీరి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే పార్టీ వర్గాల్లో గందరగోళం నెలకొంటుందనే భావన పెద్దల్లో ఉందట. త్వరలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో యువనేత ఆధిపత్యపోరు పార్టీకి రాజమండ్రిలో నష్టం చేకూరుస్తుందని నిఘావర్గాలు రిపోర్ట్ ఇచ్చాయట. ఆ నివేదికల ఆధారంగా సీఎం జగన్ స్పందన ఉంటుందని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
ఓ లెక్చరర్‌పై దాడి ఘటనతో భగ్గుమన్న విభేదాలు..!
ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన కొత్తలో భరత్, రాజా సఖ్యంగా ఉన్నట్టు కనిపించినా.. తర్వాత పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. ఇటీవల రాజానగరం పరిధిలోని సీతానగరం మండలంలో ఎస్టీ అధ్యాపకుడు పులుగు దీపక్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. వీరంతా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వర్గీయులుగా ఎంపీ భరత్ అండ్ కో ఆరోపణ. లెక్చరర్‌పై దాడిని ఖండించిన ఎంపీ.. బాధితుడిని పరామర్శించి.. బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఎమ్మెల్యే రాజాతోపాటు ఆయన వర్గం ఫైర్ అయ్యింది. నియోజకవర్గంలో అడుగుపెట్టలేరని ఎంపీ భరత్‌ను హెచ్చరించారు. ఈ వివాదంలో తర్వాత ఎంపీ భరత్ కాస్త వెనక్కి తగ్గారు.
తాడోపేడో తేల్చుకునే పనిలో ఎమ్మెల్యే రాజా?
ముందుగా గొడవ పెట్టుకోవడం.. తర్వాత తూచ్ అని పక్కకు తప్పుకోవడం ఎంపీ భరత్‌కు పరిపాటిగా మారిందని ఆగ్రహంతో ఉన్నారట ఎమ్మెల్యే రాజా. అందుకే తాడేపల్లి నుంచి పిలుపు వచ్చినప్పటి నుంచి.. పార్టీ పెద్దలకు చెప్పాల్సిన అంశాలపై గట్టి హోంవర్కే చేశారట. వాటి ఆధారంగా తాడోపేడో తేల్చుకోవాలని రాజా నిర్ణయించినట్టు సమాచారం. పదే పదే వివాదాలు రాకుండా అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ పొందాలని చూస్తున్నారట. మరి.. తాడేపల్లి పార్టీ పెద్దలు ఈ ఎపిసోడ్‌కు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.