NTV Telugu Site icon

Pudding and Mink Pub: వివిధ కోణాల్లో దర్యాప్తు.. ఫోరెన్సిక్ కి డ్రగ్స్ శాంపిల్స్

Joel Davis

Joel Davis

హైదరాబాద్ లో సంచలనం కలిగించిన రాడిసన్ హోటల్ లో పోలీసుల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఫుడింగ్ మింక్ పబ్ కేసుపై అటు పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. పబ్ కేసు లో పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇప్పటికే ఈ కేసులో పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఈ కేసులో పరారీలో ఉన్న పార్టీ నిర్వాహకుడు అర్జున్‌ వీరమాచినేని కోసం గాలిస్తున్నాయి పోలీస్ బృందాలు. ఈవెంట్‌ మేనేజర్‌ కునాల్, డీజే శశిధర్‌రావుల కీలకపాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్నవారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. పబ్ లో లభించిన శాంపిల్స్‌ సేకరించి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్. అక్కడ దొరికినవి కొకైన్ డ్రగ్స్ గా నిర్దారణకు వచ్చారు పోలీసులు. వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

ఈ కేసుకి సంబంధించి డీసీపీ జోయల్ డేవిస్ మాట్లాడుతూ, పబ్ 24 గంటలు తెరిచి ఉంటుందని ప్రచారం చేసి కస్టమర్లను ఆహ్వానించారని, అది నమ్మి అనేకమంది కస్టమర్లు పబ్ కు వచ్చి ఉంటారన్నారు. పబ్ కు వచ్చిన కస్టమర్ల జాబితాను మీడియాలో చూపిస్తున్నారని తెలిపారు. పబ్ కు వచ్చిన వారి పేర్లు బయటపెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. వారిలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే వారి పేర్లు తామే మీడియాకు తెలియచేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. అనుమానం ఉన్నవారి నుంచి శాంపిల్స్ సేకరిస్తామని తెలిపారు. దాడి సమయంలో మేనేజర్ కాబిన్ వద్ద ఐదు కొకైన్ ప్యాకెట్లు దొరికాయని తెలిపారు. మేనేజర్ గతంలో గోవాలో ఓ పబ్ లో పనిచేసి ఇక్కడికి వచ్చాడని, ఈ కేసులో గోవా లింకులు ఏమైనా ఉన్నాయేమో తేలుస్తామన్నారు. ఈ వ్యవహారం పబ్ యజమానులకు తెలియకుండా జరిగే అవకాశం లేదని, అందుకే వారిపైనా కేసు నమోదు చేశామని తెలిపారు.

ఈ పబ్ లోకి రావడం అంత ఈజీ కాదని మెంబర్ షిప్ వున్నవారికే అవకాశం వుందన్నారు. పబ్ లో ఎవరైనా అడుగుపెట్టాలంటే ఓ యాప్ సాయంతో ఓటీపీ ఎంటర్ చేస్తేనే అనుమతి లభిస్తుందని వివరించారు. తాము దాడి చేసిన సమయంలో పబ్ లో 148 మంది ఉన్నారని, వారిలో ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పబ్ లో జనం తక్కువగా వుంటే అప్పుడు బయటివారిని అనుమతిస్తారని డీసీపీ వివరించారు.

Rahul Sipligunj: అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు