UK07 Rider: “అమ్మా నీ ప్రేమ కావాలి”.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే ఫేమస్ యూట్యూబర్ సూసైడ్ అటెంప్ట్.. కట్‌చేస్తే..

Anurag Dobhal

Anurag Dobhal

YouTuber Anurag Dobhal (UK07 Rider) Suicide Attempt: డబ్బు, ఫాలోయింగ్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎలాగైనా బతికేయొచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ.. తల్లి దండ్రుల ప్రేమ, ముఖ్యంగా కన్న తల్లి ప్రేమ లేకుంటే జీవనమే కష్టంగా మారుతుంది. తల్లి దండ్రులు బతికి ఉన్నా.. వాళ్లు మనల్ని పట్టించుకోకుంటే చాలా బాధగా ఉంటుంది. ఇదే బాధ ఓ ప్రముఖ యూట్యూబర్‌కు ఎదురైంది. కట్‌ చేస్తే ఆ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. అనురాగ్ డోబాల్(UK07 Rider). అనురాగ్ అంటే లక్షలాది మంది ఫాలోవర్లు, గ్యారేజీ నిండా ఖరీదైన లగ్జరీ కార్లు, స్పోర్ట్స్‌ బైక్స్‌ ఇవే కనిపిస్తాయి. కానీ.. అతడి మనసులో మెదలుతున్న ఆవేదన ఎవ్వరికీ కనిపించలేదు. బయట ప్రపంచానికి అనురాగ్ డోబాల్ (UK07 Rider) జీవితం ఒక రంగుల కల. కానీ, ఆ గ్లామర్ తెర వెనుక ఒక మనిషి ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నాడో శనివారం జరిగిన ఒక భయంకరమైన ఘటనతో ప్రపంచానికి తెలిసింది. తన తల్లి ప్రేమ కోసం పరితపిస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటూ 150 కిలోమీటర్ల వేగంతో కారును డివైడర్‌కు ఢీకొట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు అనురాగ్..

READ MORE: Sircilla: వీర వనితలకు సిరిసిల్ల నేతన్న స్పెషల్ గిఫ్ట్.. ఒకే చీరపై భారత మహిళల విజయగాథలు..

వాస్తవానికి.. అనురాగ్ గత కొన్ని రోజుల ముందు వేరే కులం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ కారణంతో అతడి కుటుంబం దూరం పెట్టింది. దూరం పెట్టడమే కాదు.. వేధింపులకు గురి చేసిందట. తన కుటుంబీకులు తనను తీవ్రంగా హింసిస్తున్నారని అనురాగ్ ఇటీవల ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. “గడిచిన కొద్ది నెలల్లో నా జీవితం ఊహించని విధంగా తలకిందులైంది. జీవితం నన్ను ఇలా నడిరోడ్డుపై పడేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు” అంటూ తాను డిప్రెషన్‌లో ఉన్నానని, ఒకవేళ తాను చనిపోతే దానికి తన కుటుంబమే కారణమని హెచ్చరించాడు. కట్‌చేస్తే శనివారం రాత్రి అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చాడు. ఈ లైవ్‌లో కారు నడుపుతూ కనిపించాడు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై టయోటా ఫార్చ్యూనర్ కారును అత్యంత వేగంతో నడుపుతూ అనురాగ్ ఇన్‌స్టాగ్రామ్ తన బాధను వ్యక్తం చేశాడు. ఎర్రబడిన కళ్లతో, గొంతు పూడుకుపోతుండగా.. “అమ్మా, వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను ఇవ్వు. నాకు నీ ప్రేమ చాలా అవసరమైంది” అంటూ అరిచాడు. తనకు ధైర్యం చెప్పే మనిషి ఒక్కడు కూడా లేడని విలపిస్తూ.. “ఇదే నా చివరి ప్రయాణం” అని కారు స్పీడోమీటర్‌ను కెమెరా వైపు తిప్పాడు. సుమారు 82 వేల మంది లైవ్‌లో చూస్తుండగానే, “గుడ్ బై” అని అరుస్తూ కారును ఒక్కసారిగా కుడివైపు తిప్పి మెడియన్ బారియర్‌ను బలంగా ఢీకొట్టాడు. కారు వేగంగా ఉండటంతో నుజ్జు నుజ్జు అయ్యింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి అనురాగ్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనురాగ్ మీరట్‌లోని ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.