ప్రతి సంవత్సరం అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం’ (International Day for the Eradication of Poverty) మానవాళికి ఒక ముఖ్యమైన బాధ్యతను గుర్తుచేస్తుంది. ప్రపంచంలో పేదరికం అనేది కేవలం తిండి, గుడ్డ, నీడ లేకపోవడం మాత్రమే కాదు. ఆధునిక కాలంలో అది డిజిటల్ అసమానతలు, పర్యావరణ మార్పుల ధాటి, విద్యా-ఆరోగ్య అవకాశాల రాహిత్యం వంటి బహుముఖ సమస్యలతో ముడిపడి ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పేదరిక నిర్మూలనా విధానాలు మారకపోతే సంక్షేమ పథకాలు ఎంత అమలు చేసినా ఆశించిన ఫలితాలు రావు అనే అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఆధునిక ప్రపంచంలో పేదరికం కొత్త రూపాలు
ఒకప్పుడు కేవలం దినసరి రాబడి ఆధారంగా పేదరికాన్ని లెక్కించేవారు. కానీ నేటి టెక్నాలజీ యుగంలో ‘డిజిటల్ పేదరికం’ ఒక పెద్ద సవాలుగా మారింది. ఆన్లైన్ విద్య, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ ఆధారిత పథకాలు విస్తరిస్తున్న వేళ, సాంకేతికతకు దూరంగా ఉన్న గ్రామీణ, నిరుపేద విభాగాలు ఈ అవకాశాలను అందుకోలేకపోతున్నాయి. మరొకవైపు ‘క్లైమేట్ పావర్టీ’ లేదా వాతావరణ మార్పుల వల్ల సంభవించే పేదరికం ముప్పు తీవ్రమవుతోంది. ఎల్ నినో, తీవ్ర రూపం దాలుస్తున్న కరువులు, ఊహించని వరదల వల్ల భూమిని, వ్యవసాయాన్ని నమ్ముకున్న పేద రైతులు, ఉపాధి కూలీలు ఒక్కరాత్రిలోనే తమ జీవనాధారాన్ని కోల్పోయి తీవ్ర నిరుపేదలుగా మారుతున్నారు.
కేవలం సంక్షేమ పథకాలే పరిపూర్ణ పరిష్కారం కావు
పేదరికం నుంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి ఉచితాలు లేదా తాత్కాలిక ఆర్థిక సాయం మాత్రమే సరిపోవు. తాత్కాలికంగా డబ్బులు పంచడం వల్ల వారి ఆకలి తీరవచ్చేమో గానీ, తర్వాతి తరం ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. స్థిరమైన ఉపాధి కల్పన, నాణ్యమైన ఉచిత విద్య, మెరుగైన ఉచిత ఆరోగ్యం , సురక్షితమైన తాగునీటి సదుపాయాలు కల్పించినప్పుడే పేదరికానికి శాశ్వత అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపైనే ఆధారపడకుండా, కుటీర పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు స్థానిక స్థాయిలోనే ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజాస్వామ్య భాగస్వామ్యంతోనే సాధ్యం
పేదరిక నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, సామాజిక సంస్కరణలు , ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలి. నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారిని నిర్ణయాధికార ప్రక్రియలో భాగస్వాములను చేసినప్పుడే క్షేత్రస్థాయిలో మార్పు సాధ్యమవుతుంది. అంతర్జాతీయ సమాజం , స్థానిక ప్రభుత్వాలు కేవలం రికార్డుల్లో గణాంకాలను తగ్గించడం కాకుండా, ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరించడమే ఈ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అసలైన లక్ష్యం.

