Site icon NTV Telugu

100 Years Gold Price History: రూ.18 నుంచి లక్ష 57 వేలు.. బంగారం 100 ఏళ్ల చరిత్ర ఇదే!

100 Years Gold Price History

100 Years Gold Price History

100 Years Gold Price History in India: ‘బంగారం’.. భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, భద్రమైన పెట్టుబడి కూడా. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని ఇష్టపడే దేశం భారత్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకప్పుడు వందల్లో ఉన్న పసిడి ధర.. ఇప్పుడు లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో గత 100 సంవత్సరాల బంగారం ధరల చరిత్రను పరిశీలిస్తే.. కాలానుగుణంగా దాని విలువ ఎంతగా పెరిగిందో స్పష్టంగా తెలుస్తుంది. పసిడి ధర రూ.18 నుంచి లక్ష 57 వేలకే చేరింది. బంగారం ధర 100 ఏళ్లలో ఎలా మారిందో ఓసారి చూద్దాం.

1925 ప్రాంతంలో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.18–20 మధ్యలో ఉండేది. ఆ కాలంలో బంగారం విలువ తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డిమాండ్ తక్కువగా ఉండటం, మార్కెట్ పరిమితులు. 1940–1960 మధ్య కాలంలో బంగారం ధరలు కొద్దిగా పెరిగినా.. పెద్ద మార్పు మాత్రం కనిపించలేదు. 1950 దశకంలో ధర రూ.90–100 పరిధిలో ఉండేది. అయితే 1970ల తర్వాత ప్రపంచ ఆర్థిక మార్పులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కారణంగా పసిడి ధరలు భారీగా పెరగడం ప్రారంభమైంది. 1980లో బంగారం ధర సుమారు రూ.1,300 దాటడం పెద్ద మైలురాయిగా నిలిచింది.

1990ల నుంచి 2000ల వరకు బంగారం పెట్టుబడిదారులకు ఆకర్షణీయ ఆస్తిగా మారింది. 1995 ప్రాంతంలో ధర దాదాపుగా రూ.4,500 ఉండగా.. 2000 నాటికి రూ.4,400–4,700 మధ్యలో ఉంది. ఆ తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు, డాలర్ మార్పిడి విలువలు, పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం వల్ల పసిడి ధరలు వేగంగా పెరిగాయి. 2010 వరకు రూ.18, 500గా ఉంది. 2010 తర్వాత బంగారం ధరల పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. 2010లో రూ.18,500 ఉన్న ధర 2020 నాటికి రూ.48,000 దాటింది. ఇటీవల సంవత్సరాల్లో ఊహించని రీతిలో పెరిగింది. 2024 వరకు రూ.78,000 వరకు చేరడం గమనార్హం. అంటే ఒక శతాబ్దంలో బంగారం విలువ వందల రెట్లు పెరిగింది.

Also Read: Mitchell Starc: భారత్‌ను చూసి అన్ని జట్లు సుస్సు పోసుకుంటున్నాయి.. స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక 2025, 2026లో ఊహించని రీతిలో పెరుగుతూ పసిడి ధరలు ఆకాశానికి తాకాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర లక్ష 57 వేలుగా ఉంది. పసిడి పెరుగుదళ చూసి సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. బంగారం తప్పనిసరి అయితేనే కొంటున్నారు. మరోవైపు పెట్టుబడిదారులకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. బంగారం ధరల ఈ శతాబ్ద ప్రయాణం చూస్తే.. దీర్ఘకాలిక పెట్టుబడిగా గోల్డ్ ఎంత స్థిరంగా, భద్రంగా ఉంటుందో అర్థమవుతుంది. ఆర్థిక అస్థిరతల సమయంలో కూడా బంగారం విలువ పెరుగుతుండటం వల్ల పెట్టుబడిదారులు దీన్ని ‘సేఫ్ హేవన్ అసెట్’గా భావిస్తారు. భవిష్యత్తులో కూడా గోల్డ్ ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version