NTV Telugu Site icon

Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

Azadi Ka Amrit Mahotsav

Azadi Ka Amrit Mahotsav

Azadi ka amrit mahotsav: భారతదేశం.. మహోన్నత భూమికలను పోషించిన నేల. విశిష్ట లక్షణాలు గల ఉపఖండం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఆలయం. జనస్వామ్యంలో రెండో స్థానం. అన్ని రంగాల్లోనూ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రాంతం. నాగరికతలకు పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం గల విశేష ప్ర’దేశం’. వైశాల్యంలో ఏడో స్థానంలో నిలిచి 7 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటుండటం ప్రత్యేకత. వేదాలకు, వివిధ శాస్త్రాలకు మన దేశం నిలయమనేది విధితమే.

స్వార్థాన్ని త్యజించి త్యాగంతో జీవితాన్ని జయిస్తేనే అమృతత్వం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతోంది. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసల ద్వారానే ఈ భావానికి బీజం పడుతుంది. వీటన్నింటి సమగ్ర స్వరూపమే భారతదేశం. వేల సంవత్సరాల చరిత్ర గల ఇండియా ఇప్పుడు స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను జరుపుకుంటోంది. ఘనమైన గతాన్ని గుర్తుచేసుకుంటూ స్ఫూర్తి పొందుతూ అభివృద్ధిలో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు శరవేగంగా పరుగెత్తుతోంది.

ఈ పోటీలో పలు విజయాలను సొంతం చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. విద్య, వైద్య, క్రీడ, ఖగోళ, శాస్త్ర సాంకేతిక, వాణిజ్య, ఆహార, ఆధ్యాత్మక రంగాల్లో తొలి ముద్ర మనదే కావటం గర్వకారణం. క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలప్పుడే తక్షశిల పేరుతో ప్రపంచంలోనే ప్రప్రథమ విశ్వవిద్యాలయం మన దేశంలో ఉండేది. గణితశాస్త్రానికి సున్నాను పరిచయం చేసింది ఇండియానే కావటం చెప్పుకోదగ్గ విషయం. చెస్‌ అనే మైండ్‌గేమ్‌ ఇండియాలోనే పుట్టింది.

 

దుస్తులకు గుండీలను తొలిసారి వాడింది భారతీయులే. హెడ్‌ మసాజ్‌గా షాంపూ మార్కెట్లోకి వచ్చింది మన దగ్గరి నుంచే. కుష్టు వ్యాధికి మందును ముందుగా కనిపెట్టింది ఇండియానే. పరమ పద సోపాన పటం అనే ఆటకు మన మోక్షపథమే ఇన్‌స్పిరేషన్‌. ఆయుర్వేదం ఆరంభమైంది భారతదేశంలోనే. సూర్యుడి చుట్టూ భూమి తిరగటానికి పట్టే సమయాన్ని లెక్కించింది మన భాస్కరాచార్యుడే. బౌద్ధ, జైన మతాలు పురుడుపోసుకున్నది ఈ పుణ్యభూమిలోనే.

ఫిబొనాక్సీ సంఖ్యల నమూనాను విశ్వానికి వివరించింది ఇండియన్లే. కళ్లకు క్యాటరాక్ట్‌ చికిత్సను మొట్టమొదటిసారిగా మనమే అందించాం. మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం ‘సి రెస్కోగ్రాఫ్‌’ను ఆవిష్కరణ చేసిన సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ కావటం గమనార్హం. మన్నికగల ఉన్నిని భారతదేశమే కనిపెట్టింది. యూఎస్‌బీని డెవలప్‌ చేసింది, డిఫైన్‌ చేసింది భారతీయ మూలాలున్న అమెరికన్‌ కంప్యూటర్‌ ఆర్కిటెక్ట్‌ అజయ్‌ వి.భట్‌ కావటం విశేషం.

పేక ముక్కల ఆట ప్రారంభమైంది ఇండియాలోనే. జనపనార సాగు పాఠాలను ప్రపంచానికి బోధించింది భారతీయులేనని సగర్వంగా చెప్పుకోవచ్చు. త్రికోణమితిలోని సైన్‌, వర్సైన్‌లు మన నక్షత్ర శాస్త్రంలోనే మనుగడలోకి వచ్చాయి. అత్యంత విజయవంతమైన పెంటియం ప్రాసెసర్లలో ఉపయోగించే చిప్‌లకు పితామహుడు మన వినోద్‌ ధామ్‌.

 

Indian education before and after 1947: అక్షరం.. ‘అమృతం’.. అజేయం. 1947కి ముందు, తర్వాత భారతీయ విద్యా వ్యవస్థ.

శుద్ధి చేసిన చక్కెరను ప్రపంచానికి అందించింది మనం పుట్టిన భారతదేశమే కావటం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ ప్రస్తావనార్హం. ఇలా చెప్పుకుంటూపోతే ఇండియా గొప్పతనాలు సుదీర్ఘ, సువర్ణాధ్యయాలుగా సాగిపోతూనే ఉంటాయి.