NTV Telugu Site icon

ఆ రోజు… యన్టీఆర్ ఇంట్లో ఏం జరిగింది!?

What happened that day between NTR, MGR and PV Narasimha Rao

సంప్రదాయాల గురించి చర్చించే సామాజిక వేదికల్లో తరచూ దర్శనమిచ్చే ఫోటో ఇది. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుతో నటులు, మాజీ ముఖ్యమంత్రులు యన్టీఆర్, ఎమ్జీఆర్ కలసి కింద కూర్చుని భోంచేస్తున్న ఫోటో! ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కావడం విశేషం! ఇక ఈ ఫోటో 1972 సంవత్సరంలో తీసినది. అప్పట్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అదే సమయంలో తెలుగునేలపై ‘జై ఆంధ్రా ఉద్యమం’ తీవ్రంగా సాగుతోంది. అంతకుముందు ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమం’ కూడా తీవ్రస్థాయిలోనే సాగింది. అప్పట్లో యన్టీఆర్ ‘పాలుపొంగు మన తెలుగు గడ్డనూ పగలగొట్టవద్దూ… ‘ అంటూ “తెలుగుజాతి మనది…నిండుగ వెలుగుజాతి మనది…” అని తన ‘తల్లా? పెళ్ళామా?’ చిత్రంలో నినదించారు. తెలంగాణ ఉద్యమాన్ని సద్దుమణిగేలా చేయడానికి అప్పటి కేంద్రప్రభుత్వం కొన్ని తాయిలాలు ప్రకటించింది. అవి ఆంధ్రప్రాంతం వారికి తీవ్రనిరాశను కలిగించాయి. దాంతో ‘జై ఆంధ్రా’ ఉద్యమం లేచింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉద్యమం మాంచి కాకమీద ఉన్నప్పుడే పి.వి.నరసింహారావు మద్రాసు సందర్శించారు. ఆ సమయంలో మద్రాసులో ఉన్న యన్టీఆర్, ఆయనను భోజనానికి పిలిచారు. అప్పటికే తమిళనాడులో సూపర్ స్టార్ గా వెలుగొందుతూ, తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎమ్జీఆర్. ఆ సమయంలో ఎమ్జీఆర్ తమిళనాడు అసెంబ్లీలో శాసనసభ్యుడుగా ఉన్నారు. దాంతో రామారావు, తాను ‘అన్న’ అంటూ ఎంతగానో అభిమానించే ఎమ్జీఆర్ ను కూడా విందుకు పిలిచారు. అలా యన్టీఆర్ ఇంట్లో పి.వి.నరసింహారావు, ఎమ్జీఆర్ కలుసుకున్నారు. కానీ, ముగ్గురూ సంప్రదాయానికి విలువనిచ్చేవారు. అందువల్ల కిందనే కూర్చుని భోజనం చేశారు. ఆ ఫోటో 1972 నాటి నుండి ఇప్పటి దాకా ఏదో ఒక సందర్భంలో దర్శనమిస్తూనే ఉంది. కరోనా కల్లోలం నేపథ్యంలో మన సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ, కింద కూర్చుని భోజనం చేయడం ఎంతో మంచిదని చెబుతూ, ఈ ఫోటోను సామాజిక మాధ్యమంలో విశేషంగా తిప్పుతున్నారు.

ఈ ముగ్గురి మధ్య మరో విశేషముంది? అదేమిటంటే, పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా 1971లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల 9 నెలలకే ఎమ్జీఆర్ తమిళనాడులో 1977 జూన్ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఎమ్జీఆర్ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల 6 నెలలకు యన్టీఆర్ 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పీవీ నరసింహారావు కడదాకా కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. భారతదేశంలో తొలి దక్షిణాది ప్రధానమంత్రిగానూ పనిచేశారు. ఎమ్జీఆర్ తొలుత జాతీయ కాంగ్రెస్ లోనూ, ఆ పైన డి.ఎమ్.కె.లో ఉన్నారు. తరువాత కరుణానిధితో కలిగిన భేదాభిప్రాయాల వల్ల బయటకు వచ్చి అన్నా డి.ఎమ్.కె. పార్టీ పెట్టి 1977లో జయకేతనం ఎగురవేసి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. మధ్యలో ఓ ఆరు నెలల మినహాయిస్తే, కడదాకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు ఎమ్జీఆర్. ఇక యన్టీఆర్ సొంతగా తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి కాగలిగారు. తరువాత 1984 ఆగస్టులో ఎమ్జీఆర్ లాగే బర్తరఫ్ అయినా, కేవలం నెల రోజులు ప్రజాపోరాటం చేసి, మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇక యన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ స్థాపించినప్పుడు ఎమ్జీఆర్ కూడా ఆ ఫ్రంట్ భాగస్వామిగా ఉన్నారు. తెలుగుబిడ్డ అయిన పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు యన్టీఆర్ ఆనందించారు. అంతేకాదు, నంద్యాల లోక్ సభ నియోజకవర్గం నుండి పీవీ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తాను బద్ధ విరోధి అయినా, తెలుగువాడయిన పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటికి నిలబెట్టక పోవడం గమనార్హం!

ఇలా ఈ ఫోటోల్లోని పీవీ, యన్టీఆర్, ఎమ్జీఆర్ కలయిక భావితరాలను సైతం ఆకర్షిస్తూనే ఉంది. వారి ఘనతను తెలియజేస్తూనే ఉండడం విశేషం.