NTV Telugu Site icon

అబార్షన్లకు కేరాఫ్ అడ్రస్‌గా వరంగల్

వరంగల్ నగరంలో భ్రూణ హత్యలు నిత్యకృత్యంగా మారాయి. అబార్షన్లను అరికట్టడంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది విఫలం కావడంతో. చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బందికి ఫోన్ చేస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేట్ హాస్పిటల్ తో ఉన్న కనెక్షన్లతో అక్రమ అబార్షన్ పై ఫిర్యాదులు ఉన్న పెద్దగా జిల్లా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జరిగిన సంఘటన నిదర్శనంగా చెబుతున్నారు. ఆడ, మగ తెలిపే లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా..డాక్టర్లు కాసులకు కక్కుర్తిపడి. అక్రమ స్కానింగ్‍ టెస్టులు చేస్తున్నారు. ఆడపిల్ల వద్దనుకుంటే అబార్షన్లు చేసేస్తున్నారు.

హన్మకొండ, వరంగల్‍, మహబూబాబాద్‍, ములుగు, భూపాలపల్లి ఇలా … ప్రతి ప్రాంతాల్లో ఇదో బడా దందాగా మారింది. వరంగల్‍ సిటీతో పాటు హన్మకొండ బస్టాండ్‍, కాకాజీ కాలనీ, విజయ టాకీస్‌‌‌‌, రాంనగర్‍, నయీంనగర్‌‌‌‌, బీమారం, రామారం, కేయూసీ రోడ్డు, జులైవాడ, ఎంజీఎం, పోచమ్మమైదాన్‍, కాశీబుగ్గ, రంగశాయిపేట, వరంగల్‌‌‌‌, శివనగర్‌‌‌‌, ఫాతిమానగర్ ఏరియాల్లోని పలు స్కానింగ్‍ సెంటర్లు, అక్రమ హాస్పిటళ్ల తో టై అప్ పెట్టుకొని అక్రమ టెస్టులు, అబార్షన్లు ఎడాపెడా చేసేస్తున్నారు. హన్మకొండ నడి బొడ్డున మూడు నెలల క్రితం యూట్యూబ్ లో చూస్తూ అబార్షన్ చేస్తున్న సిట్ హాస్పిటల్ ని సీజ్ చేసిన తీరు మరువక ముందే వరంగల్ కాశిబుగ్గ లో అక్రమ అబార్షన్ తీరు విస్మయం కలిగించింది.

వరంగల్ కాశీబుగ్గలోని వినయ్ ఆస్పత్రిలో అక్రమ అబార్షన్ జరుగుతుంది అంటూ చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది ఫోన్ వచ్చింది అప్రమత్తం అయిన హెల్ప్ లైన్ సిబ్బంది ఓ భ్రూణహత్యను అడ్డుకున్నారు. కాశీబుగ్గ వినయ్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకోవడానికి యువతి కుటుంబసభ్యులతో రావడంతో చైల్డ్ లైన్ సిబ్బంది రంగప్రవేశం చేశారు. ఆసుపత్రి సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో బాలల సంరక్షణాధికారి దొమ్మటి రాజు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీని పరిశీలించడంతో అబార్షన్ గుట్టు రట్టయ్యింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రయివేట్ ఆస్పత్రులే కేంద్రంగా ఆర్ఎంపీల సాయంతో అనేక మంది గర్భిణీలకు అక్రమ అబార్షన్లు చేస్తున్నారు. ఇవి చాలవన్నట్టుగా సంతాన సాఫల్య కేంద్రాలను ఆర్‌ఎంపీలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్నది ఆర్ఎంపీ వైద్యుడే.. అతనే గైనకాలజీ వైద్యునిగా అవతారమెత్తాడు. కమలాపూర్ మండల కేంద్రంలో పిల్లలు లేని తల్లిదండ్రులను ఏమార్చి ప్రత్యేక వైద్య చికిత్స అంటూ మోసం చేస్తున్నాడు. హనుమకొండ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుల పేర్లతో క్లినిక్ ఏర్పాటు చేసి,అర్హత లేకున్నా తానే పరీక్షలు నిర్వహిస్తూ టెస్టులు చేస్తూ ఇంజెక్షన్ వేస్తూ సంతాన సాఫల్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. డీఎంహెచ్‌ఓ లలితాదేవి రాత్రి 12 గంటలకు పక్కా సమాచారంతో సూర్య నర్సింగ్ హోమ్ పై దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశారు. అలాగే హన్మకొండలోని సాయి హాస్పటల్లో యూట్యూబ్ లో చూసి అబార్షన్ చేస్తుండగా పట్టుకొని కేసు కూడా పెట్టారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా వైద్య అధికారుల పర్యవేక్షణ కొరవడడం.. కాసులకు కక్కుర్తి పడడంతోనే ఒక వైపు అక్రమ అబార్షన్ లు జరుగుతున్నాయి మరో వైపు నకిలీ వైద్యులు నిర్వహిస్తున్నా సంతాన సాఫల్య కేంద్రాలు నడుస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ముడుపులకు ఆశపడుతున్నారు. దీంతో సామాన్యుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ కాసుల దందాలో భాగం అవుతున్న ఆర్ఎంపీలకు చెక్ పెడితే అక్రమ అబార్షన్ అపడమే కాదు నకిలీ వైద్యుల ఆగడాలను అరికట్టవచ్చంటున్నారు.