(జూన్ 16న నటుడు మిథున్ చక్రవర్తి పుట్టినరోజు)
ఈ తరం ప్రేక్షకులకు మిథున్ చక్రవర్తి అనగానే ఆయన అభినయించిన తాజా చిత్రాలు గుర్తుకు వస్తాయి. వాటిలో మిథున్ పోషించిన కేరెక్టర్ యాక్టర్, విలన్ రోల్స్ స్ఫురిస్తాయి. ఈ మధ్య వెంకటేశ్, పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్రం కూడా మనవాళ్ళకు గుర్తుకొస్తుంది. పలు పరభాషా చిత్రాల తెలుగు అనువాదంలోనూ మిథున్ నటించిన పాత్రలు కనిపిస్తాయి. నిజానికి యావద్భారతాన్నీ తన అభినయంతోనూ, డాన్సుతోనూ అలరించిన ఘనుడు మిథున్ చక్రవర్తి. రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలచిన మేటి నటుడు, సహాయ పాత్రలోనూ ఉత్తమ నటునిగా నేషనల్ అవార్డు అందుకున్న నటమాణిక్యం. ఇక డిస్కో కింగ్ గా ఆల్ ఇండియా అభిమానం చూరగొన్న ఘనుడు మిథున్. డిస్కోడాన్సర్, డాన్స్ డాన్స్ చిత్రాలలో మిథున్ డాన్స్ చూసి ఎంతోమంది అమ్మాయిలు ఫిదా అయిపోయారు. ఇక మిథున్ కనిపిస్తే చాలు అదే పదివేలు అనుకొనే అభిమానులూ ఉండేవారు. మిథున్ ఎక్కడికి వెళ్ళినా, ఆయనపై అభిమానుల తాకిడి ఉండేది. మిథున్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం మా వల్ల కాదు అని ముంబయ్ లో పోలీస్ అధికారులు అనేవారు. మాతృభాష బెంగాల్ లో ఉత్తమనటనతో ఆకట్టుకున్న మిథున్, బాలీవుడ్ చేరిన తరువాత స్టార్ హీరోగా జేజేలు అందుకున్నారు. ఆ తరువాత స్టార్ డమ్ లోనే చాలా ఏళ్ళు సాగారు. మళ్ళీ విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నారు.
మిథున్ చక్రవర్తి నటునిగా మారడమే చిత్రంగా జరిగింది. సినిమా రంగంలో అడుగుపెట్టక ముందు నక్సల్బరీ ఆకర్షించడంతో నక్సలైట్ గా ఉన్నారు. మృణాల్ సేన్ అతనిలోని వాడిని, వేడిని గమనించి, తన మృగయా చిత్రం ద్వారా సినిమా రంగానికి పరిచయం చేశారు. తొలి సినిమాతోనే మిథున్ చక్రవర్తి నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా అవార్డు లభించింది. దాంతో కళ ద్వారా కూడా సమాజసేవ చేయవచ్చునని భావించిన మిథున్ సినిమా రంగంలోనే కొనసాగారు. అనేక హిందీ, బెంగాలీ భాషా చిత్రాల్లో హీరోగా నటించిన మిథున్ చక్రవర్తి, ఓ నాటి అందాల నటి యోగితా బాలిని పెళ్ళాడారు. ఈమె అంతకు ముందు ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ మూడో భార్యగా ఉండేది. మిథున్, యోగిత దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె.
పలు తెలుగు చిత్రాల రీమేక్స్ లో మిథున్ చక్రవర్తి నటించారు. మన కళాతపస్వి కె.విశ్వనాథ్ రూపొందించిన సప్తపది హిందీ రీమేక్ జాగ్ ఉఠా ఇన్సాన్లో శ్రీదేవితో కలసి నటించారు మిథున్. ఆ సినిమా తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారిద్దరూ కలసి వతన్ కే రఖ్ వాలే, వక్త్ కీ ఆవాజ్, గురు చిత్రాలలో నటించారు. శ్రీదేవి, మిథున్ ను ఎంతగానో ప్రేమించింది. ఇద్దరూ ఒకరినొకరు విడచి ఉండలేని స్థితిలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే అప్పటికే యోగితాబాలి సంతానం ఉండడంతో మిథున్ కుటుంబానికే విలువనిచ్చాడు. దాంతో శ్రీదేవి, మిథున్ పెళ్ళి ఓ కలగా కరిగిపోయింది. మిథున్ నక్సలైట్ గా ఉన్న సమయంలోనే ఆయన కుటుంబం పలు కష్టాలు చవిచూసింది. అతని సోదరుడు కరెంట్ షాక్ కు గురై మరణించాడు. అప్పటి నుంచీ మిథున్ కు కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఆ కారణంగానూ శ్రీదేవితో మిథున్ దూరంగా జరిగాడని చెబుతారు. ఏది ఏమైనా ఇప్పటికీ హిందీ సినిమా రంగంలో మిథున్ ను శ్రీదేవి ప్రియుడు అని పిలిచేవారు ఉన్నారు.
మిథున్ కు తొలి నుంచీ సామాజిక దృక్పథం ఉండడంతో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ఇక మిథున్ పై బెంగాలీలో పలు పుస్తకాలు రూపొందడం విశేషం. ఆయన కథ ఆధారంగా రూపొందిన జిమ్మీ జింగ్ చాక్ కామిక్ బుక్ బెంగాలీ బాలలను విశేషంగా ఆకట్టుకుంది. రాజకీయాల్లోనూ మిథున్ కు ప్రవేశం ఉంది. ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీ మధ్య సయోధ్య కుదర్చడంలో మిథున్ కీలక పాత్ర పోషించారు. తరువాత రాజ్యసభ సభ్యునిగానూ మిథున్ పనిచేశారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి తపిస్తూనే ఉన్నారు మిథున్ చక్రవర్తి.