తెలంగాణలో రైతు బంధు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గులాబీ నేతలు తమ అధినేతపై అభిమానాన్ని వెరైటీగా చాటుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఓ ఎమ్మెల్యే కేసీఆర్ బొమ్మను వెరైటీగా తయారుచేయించారు. 200 క్వింటాల్ నవ ధాన్యాలతో కేసీఆర్ బొమ్మతో పాటు జై తెలంగాణ, రైతు బంధు నినాదాలతో రూపొందించారు. పంట పొలాల్లో కేసీఆర్ బొమ్మని వడ్లు బియ్యం ,మొలకలతో తయారుచేసి వెరైటీగా రైతు బంధు ఉత్సవాలను నిర్వహించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. దీనిపై ఊరి పేరుతో పాటు జై కేటీఆర్, జై పువ్వాడ, జై నామా నినాదాలు రాశారు. మొలకలు రావడంతో ఈ బొమ్మ కలర్ ఫుల్ గా వుంది.
రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో వడ్లు, బియ్యంతో కేసీఆర్ బొమ్మ చిత్రీకరణ చేశారు. 11 రకాల నవధాన్యాలతో జై కేసీఆర్, జై రైతు బంధు, జై తెలంగాణ అంటూ నినాదాలు చిత్రీకరించారు. పది రోజుల క్రితం విత్తనాలను నాటడంతో మొలకలు వచ్చి అందంగా ఆకర్షణీయంగా తయారయ్యాయి. వీటిని చూసేందుకు రైతులతో పాటు సమీప గ్రామాల ప్రజల నారాయణపురానికి క్యూ కట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా క్రమం తప్పకుండా రెండు పంటల కోసం రైతు బంధు సాయం అందిస్తున్నారు. లక్షలాదిమంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రైతుబంధు సంబరాలతో గ్రామాల్లో ముందే సంక్రాంతి వేడుక వచ్చిందంటున్నారు రైతులు.