NTV Telugu Site icon

ఆర్కే ప్రస్థానం.. 4 దశాబ్దాలుగా ఉద్యమంలో కీలక పాత్ర..

మావోయిస్టు అగ్రనేత ఆర్కేఅనారోగ్యంతో కన్నుమూశారు. ఆర్కేగా సుపరిచితులైన అక్కిరాజు హరగోపాల్‌ ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దక్షిణ బస్తర్‌ అడవుల్లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆర్కే మృతిని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కూడా ధ్రువీకరించారు. దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులున్నాయి. అలిపిరి దగ్గర 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు ఆర్కే. బలిమెల ఎన్‌కౌంటర్‌ నుంచి ఆర్కే తృటిలో తప్పించుకోగా.. ఈఘటనలో ఆయనకు బుల్లెట్‌ గాయమైంది. 2004 అక్టోబరు 15న అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. ఆర్కేపై కోటి రూపాయల రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు ఆర్కే. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆర్కే.. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్‌. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట‌. నాలుగు ద‌శాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు ఆర్కే. ఉద్యమ నేత‌గా మారిన స‌మ‌యంలోనే త‌న పేరును రామ‌కృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ త‌ర్వాత విప్లవోద్యమంలో అగ్రనేత‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయ‌న మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. ఏపీ ఒడిశా స‌రిహ‌ద్దు ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆయ‌న‌.. వైఎస్ హ‌యాంలో ప్రభుత్వంతో చ‌ర్చలు జ‌రిపేందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2004 అక్టోబ‌ర్ 15న వైఎస్ ప్రభుత్వంతో చ‌ర్చలు జ‌రిపిన బృందానికి ఆర్కే నేతృత్వం వ‌హించారు. ఇక, 2003లో అలిపిరి దగ్గర అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై జ‌రిగిన దాడి వెనుక కూడా ఆర్కే కీల‌క సూత్రధారిగా ఉన్నాడనే ఆరోపణలున్నాయి. దీంతో పాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు కేసుల్లో ఆర్కే ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈయ‌న‌పై దాదాపు 85 కేసులు ఉన్నట్లు స‌మాచారం. నాలుగేళ్ల క్రితం జరిగిన బ‌లిమెల ఎన్‌కౌంట‌ర్‌లో ఆర్కే కుమారుడు మ‌ర‌ణించాడు. అదే ఎన్‌కౌంట‌ర్‌లో ఆర్కేకు బుల్లెట్ గాయ‌మైంది. అప్పటి నుంచి ఆయ‌న అనారోగ్యంతో బాధపడుతున్నారు. చివరకు అదే అనారోగ్యంతో ఆర్కే మృతిచెందిన‌ట్లు ఛ‌త్తీస్‌గ‌ఢ్ డీజీపీ ధ్రువీక‌రించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ప‌ద్మజ‌ను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్యమంలో ప‌నిచేశారు. ఉద్యమం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఆమె… టీచ‌ర్‌గా ప‌నిచేశారు. ఆమెపై కూడా ప‌లు కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి కూడా టీచ‌ర్‌గా ప‌నిచేశారు.

గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని తుమ్రుకోట ఆర్కే స్వస్థలం. 80-90 దశకాల్లో బలంగా కనిపించిన పీపుల్స్‌వార్‌తో తన ఉద్యమ ప్రయాణం మొదలుపెట్టిన ఆర్కే మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఎదిగేవరకూ ఎన్నో సవాళ్లను చూశారు. జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి నుంచి కేంద్ర కమిటీ వరకు వెళ్లారు… పీడిత వర్గాల తరుపున ఎన్నో పోరాటాలు చేసిన ఆర్కేఎంచుకున్న సాయుధ పోరాటం కారణంగా ఆంధ్ర, తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో 85 కేసులు ఉన్నాయి. 200 మంది పోలీసుల మృతికి కారకుడిగా ఆయనపై అభియోగాలున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన దాడి కేసులోనూ ఆర్కే పాత్ర ఉందని ఆయన తలపై 20 లక్షల రివార్డ్‌ ను పోలీసులు ప్రకటించారు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004 లో నక్సల్స్‌తో శాంతి చర్చలు జరిపిన సందర్భంలో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. సుదీర్ఘ కాలం తరువాత ఆర్కే మీడియా ద్వారా ప్రజలకు కనిపించటం అదే తొలిసారి.. ఆఖరి సారి కూడా.. ఆ తర్వాత చర్చలు విఫలం అవడం, వరుసగా మావోయిస్టుల ఏరివేతతో ఆర్కే సహా ముఖ్యనేతలంతా ఎక్కడున్నారనే సమాచారాన్ని రహస్యంగా ఉంచారు. నాలుగేళ్ల క్రితం ఏవోబీలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్కే తృటిలో తప్పించుకున్నారని, ఆయనకు బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయని వార్తలు వెలువడ్డాయి. మరికొన్ని సందర్భాల్లోనూ పోలీసుల కూబింగ్‌ నుంచి, ఎదురుకాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.. బీజాపూర్ అటవీ ప్రాంతంలో ఆర్కే చనిపోయారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. చాలా కాలంగా ఆయన ఆ ప్రాంతం నుంచే తన వ్యూహాలు అమలు చేస్తున్నారు. . 2004 లోనే వివిధ రాష్ట్రాల్లోని విప్లవకారులంతా కలిసి మావోయిస్టు పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పడ్డంలోనూ ఆర్కే పాత్ర ప్రముఖంగా ఉందని వార్తలు వెలువడ్డాయి. ఆయన లేని లోటు విప్లవ ఉద్యమంలో ఎవరూ పూడ్చలేనిదంటున్నారు.