NTV Telugu Site icon

ముగ్ధ‌ మ‌నోహ‌ర రూపం మీనా

Meena

(సెప్టెంబ‌ర్ 16న న‌టి మీనా పుట్టిన‌రోజు)
బాల‌న‌టిగానే భ‌ళా అనిపించి, ముగ్ధ‌మ‌నోహ‌ర రూపంతో నాయిక‌గా అల‌రించి, అబిన‌యంతోనూ ఆక‌ట్టుకొని చిత్ర‌సీమ‌లో త‌న‌దైన బాణీ ప‌లికించారు మీనా. ఇప్ప‌టికీ మీనా అన‌గానే చాలామందికి ముద్దు ముద్దు మాట‌ల‌తో బొద్దుగా అల‌రించిన బాల‌తార మీనా గుర్తుకు వ‌స్తుంది. ప‌రువాల ప్రాయాన‌ సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలుగానూ స్ఫురిస్తుంది. చంటి ప్రియురాలుగా చేసిన న‌ట‌న కూడా మ‌దిలో మెద‌ల‌క మాన‌దు. త‌రువాతి రోజుల్లో శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని భ‌క్తురాలు వెంగ‌మాంబ‌గా అల‌రించిన వైన‌మూ మ‌న జ్ఞాప‌కాల్లో క‌ద‌లాడుతుంది. అందాల అభినేత్రిగా మీనా జ‌నం మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేశారు. అనేక‌మంది టాప్ స్టార్స్ తో బాల‌న‌టిగానూ, నాయిక‌గానూ న‌టించి మ‌రో శ్రీ‌దేవి అన్న పేరు కూడా సంపాదించారు. ద‌క్షిణాది భాష‌ల‌న్నిటా మీనా అభిన‌యం ఆక‌ట్టుకుంది. కొన్ని హిందీ చిత్రాల‌లోనూ మీనా మెరిసింది. ఇప్ప‌టికీ తన వ‌ద్ద‌కు వ‌చ్చిన పాత్ర‌ల్లో న‌చ్చిన‌వాటిని అంగీక‌రిస్తున్నారు.

మీనా 1976 సెప్టెంబ‌ర్ 16న మ‌ద్రాసులో జ‌న్మించారు. శివాజీ గ‌ణేశ‌న్ న‌టించిన నెంజ‌న్ గ‌ళ్ చిత్రంలో తొలిసారి మీనా తెర‌పై క‌నిపించారు. తెలుగులో మీనా మొద‌టిసారి క‌నిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన సిరిపురం మొన‌గాడు. ఈ చిత్రం త‌రువాత ఇల్లాలు-ప్రియురాలు, కోడెత్రాచు, బావామ‌ర‌దళ్ళు, సూర్య‌చంద్ర‌, రెండు రెళ్లు ఆరు, సిరివెన్నెల‌ సినిమాల్లో బాల‌న‌టిగా భ‌లేగా న‌టించి అల‌రించారు. మోహ‌న్ గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య‌శాంతి నాయిక‌గా తెర‌కెక్కిన క‌ర్త‌వ్యంలో లేలేత అందాల‌తో ఓ కీల‌క పాత్ర పోషించారు. ఏయ‌న్నార్ ముఖ్య‌పాత్ర పోషించిన సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలులో ఆ మ‌హాన‌టునితో పోటీగా న‌టించి మంచిపేరు సంపాదించారు. ఆయ‌న‌తో క‌ల‌సి న‌టించిన రాజేశ్వ‌రి క‌ళ్యాణంతో ఉత్త‌మ‌న‌టిగా నందినీ సొంతం చేసుకున్నారు మీనా. అన్బుల్ల ర‌జ‌నీలో ర‌జ‌నీకాంత్ తో బాల‌న‌టిగా న‌టించిన మీనా, త‌రువాత ఆయ‌న‌తోనే ముత్తు చిత్రంలో నాయిక‌గా మెరిసి మురిపించారు. అలాగే కృష్ణ‌తోనూ ఇంద్ర‌భ‌వ‌నంలో నాయిక‌గా న‌టించారు. ఆ స‌మ‌యంలోనే మీనాను మ‌రో శ్రీ‌దేవిగా కొంద‌రు కీర్తించారు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ తో విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు మీనా. చిరంజీవితో ముఠామేస్త్రి, స్నేహం కోసం, బాల‌కృష్ణ‌తో బొబ్బిలిసింహం, క్రిష్ణ‌బాబు, నాగార్జున‌తో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్ల‌రి అల్లుడు, మోహ‌న్ బాబుతో అల్ల‌రి మొగుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించారు మీనా. తెలుగునాట ఆమె హిట్ పెయిర్ వెంక‌టేశ్ అనే చెప్పాలి. వారిద్ద‌రూ క‌ల‌సి న‌టించిన చంటి, అబ్బాయిగారు, సుంద‌ర‌కాండ‌, సూర్య‌వంశం, దృశ్యం చిత్రాలు తెలుగువారిని విశేషంగా అల‌రించాయి. ఇక అల్ల‌రి పిల్ల‌, గిల్లిక‌జ్జాలు, పెళ్ళాం చెబితే వినాలి, భ‌లే పెళ్ళాం, చిల‌క‌ప‌చ్చ కాపురం, మా అన్న‌య్య‌, పాపే నా ప్రాణం, అమ్మాయి కోసం, పుట్టింటికి రా చెల్లీ, స్వామి, వెంగ‌మాంబ‌ వంటి చిత్రాల‌లోనూ మీనా అభిన‌యం జ‌నాన్ని ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో దృశ్యం-2లోనూ మీనా న‌టిస్తున్నారు. ఇది కాకుండా ర‌జనీకాంత్ అన్నాత్తేలోనూ మీనా క‌నిపించ‌నున్నారు. మీనా బెంగ‌ళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ విద్యాసాగ‌ర్ ను 2009లో వివాహం చేసుకున్నారు. వారికి నైనిక అనే అమ్మాయి ఉంది. ఐదేళ్ళ ప్రాయంలోనే నైనిక తేరి అనే చిత్రంలో న‌టించింది. మీనా కొన్ని టీవీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్నారు. మ‌రి రాబోయే చిత్రాల‌తో మీనా ఏ తీరున జ‌నాన్ని ఆక‌ట్టుకుంటారో చూద్దాం.