NTV Telugu Site icon

పాతికేళ్ళ నిన్నే పెళ్ళాడ‌తా

(అక్టోబ‌ర్ 4న నిన్నే పెళ్ళాడ‌తాకు 25 ఏళ్ళు)

ప్ర‌తిభ‌ను గౌర‌వించ‌డం అన్న‌ది నాటి అగ్ర‌క‌థానాయ‌కులు య‌న్టీఆర్, ఏయ‌న్నార్ కు ఉండేది. వారి సొంత చిత్రాల ద్వారా ఎంద‌రో ప్ర‌తిభావంతుల‌కు అవ‌కాశాలు క‌ల్పించారు. అదే తీరున త‌రువాతి త‌రం హీరోలు కృష్ణ, కృష్ణంరాజు వంటివారు కూడా సాగారు. అక్కినేని న‌ట‌వార‌సుడు నాగార్జున సైతం తాను నిర్మించిన చిత్రాల ద్వారా అనేక‌మందికి అవ‌కాశాలు క‌ల్పించి, చిత్ర‌సీమ‌లో వారు నిల‌దొక్కుకొనేలా చేశారు. ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ తొలి చిత్రం గులాబీ చూడ‌గానే, నాగార్జున ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ఆశించారు. త‌త్ఫ‌లితంగా రూపొందిన చిత్ర‌మే నిన్నే పెళ్ళాడ‌తా. ఈ చిత్రంలోని క‌థ క‌న్నా క‌థ‌నం వైవిధ్యంగా ఉంటుంది. అదే జ‌నాన్ని భ‌లేగా ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ సినీస్టూడియోస్ ప‌తాకంపై నాగార్జున నిర్మించి, న‌టించారు. ఇందులో ఆయ‌న స‌ర‌స‌న ట‌బు నాయిక‌గా న‌టించారు. 1996 అక్టోబ‌ర్ 4న విడుద‌లైన నిన్నే పెళ్ళాడ‌తా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ యేడాది బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో ఒక‌టిగా నిల‌చింది.

నిన్నే పెళ్ళాడ‌తా క‌థ ఏమిటంటే – ప్రేమించి పెళ్ళి చేసుకున్న చెల్లెలిని ఇద్ద‌రు అన్న‌లు దూరం పెడ‌తారు. అన్న‌లంటే ప్రాణం పెట్టే ఆ చెల్లెలి, భ‌ర్త‌తోనే ఆనందంగా కాపురం చేస్తూ, ఇద్ద‌రు అమ్మాయిల త‌ల్లి అవుతుంది. త‌న పెద్ద కూతురుకు వ‌దిన మ‌హాల‌క్ష్మి పేరు పెట్టుకుంటుంది. అంద‌రూ ఆమెను పండు అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే పండు అని పిలిపించుకోవ‌డం ఆమెకు ఇష్టం ఉండ‌దు. మ‌హాల‌క్ష్మి ఫ్లైట్ ట్రెయినింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తుంది. ఆమె తండ్రి స్నేహితుని ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. వారి ప‌క్కింట్లోనే మ‌హాల‌క్ష్మి మేన‌మామ‌లు ఉంటారు. కానీ, ఆమెకు ఈ విష‌యం తెలియ‌దు. మ‌హాల‌క్ష్మి మేన‌మామ‌లు, ఆమె గెస్ట్ గా దిగిన ఆయ‌న ఎంతో స్నేహంగా ఉంటారు. ఎప్పుడూ క‌ల‌సి మెల‌సి పార్టీలు చేసుకుంటూ ఉండ‌డం విశేషం. మేన‌మామ చిన్న‌కొడుకు శ్రీ‌ను జీవితాన్ని ఎంత‌గానో ఎంజాయ్ చేసే మ‌నిషి, రేసుల్లో పాల్గొంటూ స‌ర‌దాగా తిరుగుతూ ఉంటాడు. మ‌హాల‌క్ష్మిని ఫ్లైట్ ట్రైనింగ్ కు తీసుకు వెడ‌తాడు.అక్క‌డ ఆమె ఫ్లైట్ లో కూర్చుని భ‌య‌ప‌డుతుంది. శ్రీ‌ను ఓదార్పు మాట‌లు ప‌నిచేస్తాయి. త‌రువాత వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే మ‌హాల‌క్ష్మి తండ్రి అంగీక‌రించ‌డు. శ్రీ‌ను నాన్న కూడా ఒప్పుకోడు. దాంతో ఊరికి వెళ్ళిన మ‌హాల‌క్ష్మిని తీసుకురావ‌డానికి శ్రీ‌ను వెళ్ళి, అక్క‌డ పోరాటం చేసి తెస్తాడు. అయితే అప్ప‌టికే త‌న పెళ్ళి శ్రీ‌నుతో జ‌ర‌గ‌ద‌ని భావించిన మ‌హాల‌క్ష్మి విషం తాగి ఉంటుంది. దాంతో అంద‌రూ కంగారు ప‌డ‌తారు. చివ‌ర‌కు మ‌హాల‌క్ష్మి కోలుకోవ‌డంతో క‌థ సుఖాంత‌మ‌వుతుంది.

క‌థ విన‌డానికి చాలా సింపుల్ గా ఉన్నా, అప్ప‌టి ప్రేక్ష‌కుల నాడి ప‌ట్టి మ‌రీ ఈ చిత్రాన్ని జ‌న‌రంజ‌కంగా తెర‌కెక్కించారు కృష్ణ‌వంశీ. ఇది ఏయ‌న్నార్ త‌న‌యుడు నాగార్జున నిర్మించిన చిత్ర‌మే అయినా ఇందులో టైటిల్ కార్డ్స్ స‌మ‌యంలో య‌న్టీఆర్ న‌టించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీతారామ‌క‌ళ్యాణంలోని సీతారాముల క‌ళ్యాణం చూత‌ము రారండి... పాటను నేప‌థ్యంగా వినిపించ‌డం విశేషం. అంతే కాదు ఈ సినిమా టైటిల్ కూడా 1968లో య‌న్టీఆర్ న‌టించిన నిన్నే పెళ్ళాడుతా నుండి వ‌చ్చిందే కావ‌డం విశేషం. ఆ త‌రువాత కూడా య‌న్టీఆర్ టైటిల్స్ తో నాగార్జున సంతోషం, ఎదురులేని మ‌నిషి వంటి చిత్రాల‌లో న‌టించి విజ‌యం సాధించారు.

ఈ చిత్రంలో శ్రీ‌నుగా నాగార్జున‌, మ‌హాల‌క్ష్మిగా ట‌బు న‌టించారు. శ్రీ‌ను క‌న్న‌వారిగా ల‌క్ష్మి, చ‌ల‌ప‌తిరావు క‌నిపించ‌గా, మ‌హాల‌క్ష్మి అమ్మానాన్న‌గా మంజుభార్గ‌వి, ఆహుతి ప్ర‌సాద్ అభిన‌యించారు. మిగతా పాత్ర‌ల్లో గిరిబాబు, చంద్ర‌మోహ‌న్, బ్ర‌హ్మాజీ, జీవా, ర‌మాప్ర‌భ‌, క‌విత‌, బెన‌ర్జీ, ఉత్తేజ్, స‌న న‌టించారు. అప్ప‌టి దాకా చ‌ల‌ప‌తిరావు అంటే విల‌న్ల వ‌ద్ద అనుచ‌రుడిగా, విల‌న్ గా, రేపిస్టుగా పేరుండేది. ఈ సినిమా ఘ‌న‌విజ‌యంతో చ‌ల‌ప‌తిరావుకు ఆ త‌రువాత నుంచీ నాయికానాయ‌కుల‌కు తండ్రి పాత్ర‌లు పోషించే అవ‌కాశం ల‌భించ‌డం విశేషం.

నిన్నే పెళ్లాడ‌తా సినిమాకు పృథ్వీ తేజ‌, ఉత్తేజ్ ర‌చ‌న చేశారు. ఈ సినిమాకు సందీప్ చౌతా సంగీతం స‌మ‌కూర్చారు. సీతారామ‌శాస్త్రి , సుద్దాల అశోక్ తేజ పాట‌లు రాశారు. ఈ చిత్రంలోని పాట‌ల చిత్రీక‌ర‌ణ చూడ‌గానే, అప్ప‌ట్లో హిందీలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన హ‌మ్ ఆప్కే హై కౌన్, దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే చిత్రాలు గుర్తుకు రాక‌మాన‌వు. ఈ సినిమాలోని పాట‌ల‌న్నీ జ‌నాన్ని ఆక‌ట్టుకున్నాయి. ఎటో వెళ్ళిపోయింది మ‌న‌సూ..., గ్రీకు వీరుడు నా రాకుమారుడు..., క‌న్నుల్లో నీ రూప‌మే..., ఇంకా ఏదో కావాలంటూ..., నిన్నే ప్రేమిస్తానంటూ..., నాతో రా త‌మాషాల‌లో తేలుస్తా... వంటి పాట‌లు నాటి యువ‌త‌ను విశేషంగా మురిపించాయి. ఈ పాట‌ల‌న్నీ సిరివెన్నెల క‌లం నుండి జాలువార‌గా, నా మొగుడు రామ్ ప్యారీ... పాట ఒక్క‌టే సుద్దాల అశోక్ తేజ రాశారు.

నిన్నే పెళ్లాడ‌తా చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించింది. అప్ప‌టి దాకా నాగార్జున చిత్రాల‌లో బిగ్ హిట్ గా నిల‌చింది. 39 కేంద్రాల‌లో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకుంది. 4 కేంద్రాల‌లో ర‌జ‌తోత్స‌వం చూసింది. ఈ సినిమాకు ఉత్త‌మ ప్రాంతీయ చిత్రంగా నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది. ఏయ‌న్నార్ పేరిట ఇచ్చే స‌కుటుంబ‌స‌ప‌రివార స‌మేతంగా చూడ‌త‌గ్గ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. ఎటో వెళ్ళి పోయింది మ‌న‌సు... పాట పాడిన రాజేశ్ క్రిష్ణ‌న్ కు ఉత్త‌మ‌గాయ‌కునిగా నంది అవార్డు ల‌భించింది. బెస్ట్ ఫిలిమ్ ఇన్ తెలుగు, బెస్ట్ డైరెక్ట‌ర్ ఇన్ తెలుగు, బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు వంటి ఫిలిమ్ ఫేర్ అవార్డుల‌నూ సొంతం చేసుకుందీ చిత్రం.

ఈ చిత్రం త‌మిళంలో ఉన్న‌యితే క‌ళ్యాణం ప‌న్నిక్కిరేన్ పేరుతో అనువాద‌మై అల‌రించింది. క‌న్న‌డ‌లో ఈ చిత్రాన్ని ప్రీత్సోద్ త‌ప్ప‌ పేరుతో రీమేక్ చేశారు. నువ్వు వ‌స్తావ‌ని చిత్రం వ‌చ్చే దాకా నాగార్జున కెరీర్ లో నిన్నే పెళ్ళాడ‌తా బిగ్ హిట్ గా కొన‌సాగింది. నిర్మాత‌గానూ నాగార్జున‌కు ఈ సినిమా మంచి లాభాలు, మంచి పేరు సంపాదించి పెట్ట‌డం విశేషం! ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీకి మ‌ళ్ళీ ఇలాంటి హిట్ ఇప్ప‌ది దాకా ద‌క్క‌లేదు.