లెజెండరీ ఇండియన్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనా వైరస్ తో పోరాడి ఈ రోజు కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. లెజెండ్ అథ్లెట్, ఫ్లయింగ్ సిఖ్‌గా పేరొందిన మిల్కా సింగ్ మే 20న కరోనా బారిన పడి దాదాపు నెలరోజుల పాటు కరోనాతో పోరాడి చివరకు మరణించారు. మే నెలలో ఆయనకు కరోనా సోకినప్పుడు చండీఘర్ లోని తన ఇంట్లోనే చికిత్స తీసుకున్నారు. ఆ తరువాత డాక్టర్ల సలహా మేరకు మొహాలీలోని ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత ఇంటికి చేరుకున్న మిల్కా సింగ్ ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారు. కానీ అనుకోకుండా ఆయన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు మిల్కా సింగ్ ను చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ ఆసుపత్రి ఐసీయూకు తరలించారు. కానీ డాక్టర్లు ఆయనను బ్రతికించలేకపోయారు.
Also Read : డబ్ల్యూటీసీ : రెండో రోజు ఆట కూడా కష్టమే..?
మిల్కా సింగ్ ప్రపంచవ్యాప్తంగా ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో దేశం కోసం అనేక పురస్కారాలను గెలుచుకున్నాడు. 1958 టోక్యో ఆసియాడ్‌లో 200 మీటర్లు, 400 మీటర్ల రేసులను గెలుచుకున్న ఆయన ఆసియా క్రీడల్లో భారత్ తరఫున నాలుగు బంగారు పతకాలు సాధించాడు. 1962 జకార్తా ఆసియాడ్‌లో 400 మీటర్లు, 4×400 మీటర్ల రిలే రేసుల్లో బంగారు పతకాలను సాధించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల ఫైనల్‌లో నాలుగో స్థానంలో నిలిచి సింగ్ ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్కాసింగ్ అప్పట్లో గుర్తింపు పొందారు. 1956, 1960, 1964 ఒలిపిక్స్‌లోనూ భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిథ్యం వహించాడు. భారత ప్రభుత్వం ఈ దిగ్గజ అథ్లెట్‌ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక మాజీ జాతీయ వాలీబాల్ కెప్టెన్ అయిన అతని భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో మరణించారు. దాదాపు ఆమె చనిపోయిన వారం తరువాత సింగ్ కన్నుమూయడం విషాదకరం. ఆయన మృతికి రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ట్వీట్లు చేశారు.
