(సెప్టెంబర్ 29న ఖుష్బూ బర్త్ డే)
ముద్దుగా బొద్దుగా సిమ్లా ఆపిల్ పండును గుర్తు చేస్తూ తెరపై కనిపించి ఊరించింది నటి ఖుష్బూ అందం. ఇప్పుడంటే మరింత భారీగా మారి, కేరెక్టర్ రోల్స్ లో కనువిందు చేస్తున్నారు కానీ, అప్పట్లో ఖుష్బూ అందం అనేక చిత్రాలలో చిందులు వేసి కనువిందు చేసింది. ఉత్తరాదిన ఉదయించిన ఖుష్బూ అందం, దక్షిణాది చిత్రాలతోనే వెలుగులు విరజిమ్మింది. తమిళ చిత్రసీమలో అనేక ఘనవిజయాలను చూసింది ఖుష్బూ. తమిళ జనం ఖుష్బూకు గుడి కట్టి పూజలు చేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. రాజకీయాల్లోనూ కాలుమోపిన ఖుష్బూ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతోంది.
ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970 సెప్టెంబర్ 29న ముంబయ్ లో జన్మించారామె. బాలనటిగా “ద బర్నింగ్ ట్రెయిన్, లావారిస్, కాలియా, దర్ద్ కా రిస్తా” వంటి చిత్రాలలో నటించిన ఖుష్బూ, అనిల్ కపూర్ ‘మేరీ జంగ్’లో “బోల్ బేబీ బోల్…” పాటలో చిందులతో ఆనందం పంచింది.
జాకీ ష్రాఫ్ జోడీగా ‘జానూ’లో మురిపించింది. ఈ సినిమాల తరువాత వెంకటేశ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’లో నాయికగా నటించి అలరించారు ఖుష్బూ. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత “కిరాయి దాదా, కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, చిన్నోడు పెద్దోడు, చిన్నికృష్ణుడు, గురుశిష్యులు, అలజడి, శాంతి క్రాంతి, పేకాట పాపారావు” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు ఖుష్బూ. అయితే తమిళనాట హీరో ప్రభుకు హిట్ పెయిర్ గా సాగారు. వారిద్దరూ నటించిన ‘చిన్న తంబి’ బంపర్ హిట్. ఆ సినిమా ఆధారంగానే తెలుగులో వెంకటేశ్ ‘చంటి’ రూపొందింది. తమిళంలో అనేక విజయాలను చూసిన ఖుష్బూ తరువాత కేరెక్టర్ రోల్స్ లో అలరించారు. తమిళనాట ఖుష్బూకు అభిమానులు గుడి కూడా కట్టించారు. అంటే ఆ ప్రాంతంలో ఖుష్బూకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఆమె పేరుతో చీరెలు, అమ్మాయిల దుస్తులు తయారయ్యేవి. చివరకు ఫుడ్ ఐటెమ్స్ కు కూడా ఖుష్బూ పేరు పెట్టి సొమ్ము చేసుకున్నవారున్నారు.
చాలా రోజుల తరువాత తెలుగులో చిరంజీవి ‘స్టాలిన్’లో ఆయనకు అక్కగా నటించారు ఖుష్బూ. ‘యమదొంగ’లో యమునిగా నటించిన మోహన్ బాబుకు జంటగా కనిపించారు. ‘అజ్ఞాతవాసి’లో హీరోకు సవతి తల్లిగా అభినయించారు. ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే తెలుగు చిత్రంలోనూ ఖుష్బూ నటించారు. ఆ సినిమా విడుదల కావలసి ఉంది. తమిళ దర్శకుడు సి.సుందర్ ను వివాహమాడిన ఖుష్బూకు ఇద్దరు పిల్లలు. రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన ఖుష్బూ మొదట్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. చిత్రంగా అదే పార్టీలో చేరి మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే హిందుత్వ సంఘాలే ఖుష్బూను వ్యతిరేకించడం గమనార్హం. ఈ ఎన్నికలో ఖుష్బూ ఓటమి చవిచూశారు. ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారామె. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలని ఈ నాటికీ తపిస్తూనే ఉన్నారు ఖుష్బూ.