Site icon NTV Telugu

పార్లమెంట్‌లో ఎంపీల రచ్చ.. చొక్కాలు పట్టుకుని కొట్టుకొని..!

ప్రజా సమస్యలపై చర్చించడం.. ప్రజల అవసరాలను గుర్తించడం.. వాటికి అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావడం.. పాత చట్టాలను సవరించండం.. ఇలా పార్లమెంట్‌కు ఎంతో అత్యున్నత స్థానం ఉంది.. అయితే, క్రమంగా అదో రాజకీయ వేదికగా మారిపోతోంది.. గతంలో ఎన్నో అర్థవంతమైన చర్చలు జరిగిన చట్టసభల్లో ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ఇలా.. అసలు చర్చ మొత్తం పక్కదారి పట్టేలా చేస్తున్నాయి.. ఇక, తాజాగా, జోర్డాన్‌ పార్లమెంట్‌లో సభ్యులు మరో ముందు అడుగు వేశారు.. పార్లమెంట్‌ వేదికగానే రచ్చ చేశారు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జోర్డాన్‌ పార్లమెంట్‌లో సమానహక్కులపై తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సాగుతుండగా.. ఆ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.. అదికాస్తా శృతిమించి వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత పరస్పర దాడికి దిగారు పార్లమెంట్‌ సభ్యులు.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఈ బిల్లు పనికిరానిదంటూ ప్రతిపక్ష సభ్యుడు అనుచిత వ్యాఖ్యలు చేయగా.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార పార్టీ ఎంపీలు.. సదరు ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు సదరు సభ్యుడు నిరాకరించడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం, దాడికి దారితీసింది.. ఇది కాస్తా చినికి చినికి తీవ్ర ఘర్షణగా మారిపోయింది.. అయితే, ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ప్రజా సమస్యలపై చర్చించడానికి ప్రజలు మిమ్మల్ని పార్లమెంట్‌కు పంపితే.. మీరు చేసే పని ఇదేనా అంటూ నెటిజన్లు ఫైర్‌ అయ్యారు.

Exit mobile version