Site icon NTV Telugu

మారనున్న మెట్రో టైమింగ్స్.. ఉదయం 6 గంటలకే మెట్రో కూత?

హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సమయాల్లో త్వరలో మార్పు చేసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10:15 గంటల వరకు మెట్రో రైళ్ల సేవలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ వచ్చే ప్రయాణికులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఉదయం 7 గంటల కన్నా ముందే మెట్రో స్టేషన్‌లకు చేరుకుని వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.

దయచేసి మెట్రో రైల్ సేవలు ఉదయం 6 గంటలకే ప్రారంభయ్యేలా చర్యలు తీసుకోవాలని, గంట సేపు మెట్రో స్టేషన్‌లో వెయిట్ చేయలేక ఇబ్బంది పడుతున్నామని, ఉదయం సమయాల్లో క్యాబ్‌లలో వెళ్లాలంటే అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ట్వీట్ ద్వారా సదరు నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. నెటిజన్ అభ్యర్థనను అంగీకరిస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఈ విషయంపై ఆలోచించాలని హైదరాబాద్ మెట్రో ఎండీని ట్యాగ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ మెట్రో ఎండీ స్పందిస్తూ.. తప్పకుండా సర్ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌కు సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చొరవతో త్వరలోనే మెట్రో రైలు సమయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని.. ఉదయం 6 గంటలకే మెట్రో రైళ్ల సేవలు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.

Read Also: కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్‌రావు

Exit mobile version